Police Caught Dumping Body: పోలీసులే దొంగల్లా!
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:34 AM
సాధారణంగా సీసీటీవీ కెమెరాలకు దొంగలు చిక్కుతుంటారు. యూపీలోని మీరట్‌లో పనిదొంగలైన పోలీసులు పట్టుబడ్డారు. దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించు కునేందుకు.....
దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం మృతదేహాన్ని మరో పోలీస్ ఠాణా పరిధిలో పడేసిన ఖాకీలు
మీరట్, డిసెంబరు 7: సాధారణంగా సీసీటీవీ కెమెరాలకు దొంగలు చిక్కుతుంటారు. యూపీలోని మీరట్‌లో పనిదొంగలైన పోలీసులు పట్టుబడ్డారు. దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించు కునేందుకు అర్ధరాత్రి వేళ వారు వేసిన ప్లాన్ నిఘా కెమెరా దృశ్యాలతో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. లోహియా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ స్టేషనరీ దుకాణం ముందు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చూసిన షాపు యజమాని సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఆ శవాన్ని తెచ్చి అక్కడ పడేసింది పోలీసులేనని తేలింది. ఆ పోలీసులు ఎవరా అని ఆరా తీయగా.. వారిది లోహియా నగర్ స్టేషన్ కాదని, ఎల్-బ్లాక్ ఔట్‌పోస్టు ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డుగా గుర్తించారు. గురువారం ఆర్ధరాత్రి దాటాక వారిద్దరూ బైక్ మీద వచ్చి ఆ దుకాణం ముందు ఆగడం.. వారి వెనకే ఓ ఆటో రావడం.. వారి సమక్షంలోనే ఆటోలోని ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని దింపి షాపు ముందుపెట్టి వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డయ్యాయి. వాస్తవానికి ఎల్-బ్లాక్ ఠాణా పోలీసులు తమ స్టేషన్ పరిధిలో ఆ మృతదేహాన్ని గుర్తించారు. ‘మృతుడు ఎవరో కనుక్కోవాలి.. ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలి.. శవజాగారం తప్పదు. ఈ తతంగమంతా ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆ మృతదేహాన్ని మరో ఠాణా పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పడేసి చేతులు దులిపేసుకుందామని భావించారు. కానీ, సీసీటీవీ కెమెరాతో కథ అడ్డం తిరిగింది. ఉన్నతాధికారులు ఎల్-బ్లాక్ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి జితేంద్ర కుమార్, కానిస్టేబుల్ రాజేశ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. హోంగార్డును సర్వీసు నుంచి తొలగించారు.