Share News

Raj Bhavan Renamed Lok Bhavan: సేవా తీర్థ్‌లో పీఎంవో

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:29 AM

ప్రధానమంత్రి కార్యాలయం పీఎంవో కొత్త కాంప్లెక్స్‌లోకి మారబోతోంది. ఇక నుంచి ఆ సముదాయాన్ని ‘సేవా తీర్థ్‌’గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ నూతన కాంప్లెక్స్‌ నిర్మాణం తుది దశలో...

 Raj Bhavan Renamed Lok Bhavan: సేవా తీర్థ్‌లో పీఎంవో

  • కొత్త కాంప్లెక్స్‌లోకి ప్రధానమంత్రి కార్యాలయం

  • తుది దశలో భవన సముదాయం నిర్మాణ పనులు

  • రాజ్‌భవన్‌ పేరు ‘లోక్‌ భవన్‌’గా మార్పు

న్యూఢిల్లీ, డిసెంబరు 2: ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కొత్త కాంప్లెక్స్‌లోకి మారబోతోంది. ఇక నుంచి ఆ సముదాయాన్ని ‘సేవా తీర్థ్‌’గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ నూతన కాంప్లెక్స్‌ నిర్మాణం తుది దశలో ఉందని అధికారులు మంగళవారం వెల్లడించారు. సేవాస్ఫూర్తిని ప్రతిబింబించే కార్యస్థలంగా, జాతీయ ప్రాధాన్యాల రూపకల్పన కేంద్రంగా ‘సేవా తీర్థ్‌’ ఉంటుందని తెలిపారు. పరిపాలనాపరమైన ఆలోచన ‘సత్తా(అధికారం)’ నుంచి ‘సేవ’కు మారుతోందన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్‌ నివాసం ‘రాజ్‌భవన్‌’ పేరును కూడా ‘లోక్‌ భవన్‌’గా మార్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు ఉన్న రహదారిని గతంలో రాజ్‌పథ్‌గా పిలిచేవారు. దానిని కూడా ఇటీవల ‘కర్తవ్య పథ్‌’గా మార్చారు. 2016లో ప్రధాని అధికార నివాసం పేరును లోక్‌కల్యాణ్‌ మార్గ్‌గా, కేబినెట్‌ సచివాలయాన్ని ‘కర్తవ్య భవన్‌’గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. బ్రిటి్‌షకాలం నాటి వలస వాసనలను పూర్తిగా తొలగించే ఉద్దేశంతో కొత్త నిర్మాణాలు, పేర్ల మార్పువంటివి మోదీ ప్రభుత్వం చేపట్టింది. సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ కొత్త ‘ఎగ్జిక్యూటివ్‌ ఎంక్లేవ్‌’కు మారుస్తున్నారు. ఇందులో పీఎంవోతో పాటు కేబినెట్‌ సచివాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం, విదేశీ అతిథులతో అత్యున్నత స్థాయి చర్చలు జరిగే ‘ఇండియా హౌస్‌’ కూడా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్‌ ఎంక్లేవ్‌-1లో కొత్తగా మూడు భవనాలు నిర్మిస్తున్నారు. అందులో వాయుభవన్‌ సమీపాన నిర్మించిన సేవాతీర్థ్‌-1లో పీఎంవో పనిచేస్తుంది. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు మొదలయ్యాయి. సేవాతీర్థ్‌-2లో కేంద్ర కేబినెట్‌ సచివాలయం ఆగస్టు నుంచే పనిచేస్తోంది. సేవాతీర్థ్‌-3లో జాతీయ భద్రతా మండలి కార్యాలయం ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌క్లేవ్‌-3లో ప్రధానమంత్రి నివాస సముదాయం రానుంది. ‘ఈ మార్పులు లోతైన సైద్ధాంతిక పరివర్తనకు నిదర్శనం. అధికారం కంటే బాధ్యతను, స్థాయి కంటే సేవకు భారత ప్రజాస్వామ్యం ఎంపిక చేసుకుంటోంది. పేర్చు మార్చడం అంటే మైండ్‌సెట్‌ కూడా మారినట్లు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పౌరులకే ప్రథమ ప్రాధాన్యమిస్తూ.. సేవ, కర్తవ్యాల భాషను మాట్లాడుతున్నాయి’ అని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 03:29 AM