Mahesh Rekhe: 2వేల శ్లోకాలతో దండక్రమ పారాయణం
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:17 AM
శుక్ల యజుర్వేదంలోని 2,000 శ్లోకాలను 50 రోజుల్లో నిరంతరంగా పఠనం చేసి దండక్రమ పారాయణం పూర్తిచేసిన ఓ యువ వేద పండితుడిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా...
19 ఏళ్ల యువ వేదమూర్తికి ప్రధాని అభినందన
న్యూఢిల్లీ, డిసెంబరు 2: శుక్ల యజుర్వేదంలోని 2,000 శ్లోకాలను 50 రోజుల్లో నిరంతరంగా పఠనం చేసి దండక్రమ పారాయణం పూర్తిచేసిన ఓ యువ వేద పండితుడిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ అద్భుతమైన ఘనత సాధించిన యువకుడు మహారాష్ట్రకు చెందిన వేదమూర్తి దేవవ్రత మహేశ్ రేఖే (19). పటిష్ఠమైన ధ్వని నియమాలు, పఠన పద్ధతులు కలిగిన ఈ దండక్రమ పారాయణాన్ని వేద పఠనంలో అత్యున్నతమైనదిగా భావిస్తారు. అంతటి గొప్ప పారాయణాన్ని మహేశ్ కాశీలోని వల్లభరామ్ శాలిగ్రామ్ సంగ్‌వేద్ విద్యాలయంలో అక్టోబరు 2 నుంచి నవంబరు 30 వరకు పూర్తిచేశారు. ఈ యువ పండితుడికి సహకారం అందించిన శృంగేరి మఠం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ, దాదాపు 200 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంతటి స్వచ్ఛతతో ఈ పారాయణ పఠనం పూర్తి కావడం అరుదైన విషయం అని పేర్కొంది. ఈ అసాధారణమైన ఘనత కాశీ నగరంలో జరగడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని మోదీ తెలిపారు.