PM Modi: వారిని వదిలేదే లేదు!
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:15 AM
దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు ఘటనకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదని, బాధ్యులందరినీ న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు...
ఢిల్లీ పేలుడు ఘటన బాధ్యుల్ని న్యాయస్థానం ముందు నిలబెడతాం
బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది: మోదీ
థింపు/ న్యూఢిల్లీ, నవంబరు 11: దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు ఘటనకు కారణమైన వారిని వదిలే ప్రసక్తే లేదని, బాధ్యులందరినీ న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ కేసుపై విచారణ సంస్థలు ఆమూలాగ్రం దర్యాప్తు జరుపుతున్నాయన్నారు. భూటాన్ మాజీ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ 70వ జన్మదినం సందర్భంగా మంగళవారం ఆ దేశ రాజధాని థింపులో జరిగిన ఓ కార్యక్రమానికి మోదీ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఢిల్లీ ఘటన నేపథ్యంలో భారమైన హృదయంతో తాను భూటాన్‌కు వచ్చానన్నారు. సోమవారం రాత్రంతా దర్యాప్తు సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నానని తెలిపారు. పేలుడు ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసిందని, బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. భారత్-భూటాన్ స్నేహ సంబంధాలను ప్రస్తావిస్తూ.. శతాబ్దాలుగా ఇరుదేశాలు గాఢమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని కలిగి ఉన్నాయని, అందువల్లే ముఖ్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి తాను భారత్ నుంచి వచ్చానని మోదీ వెల్లడించారు. మాజీ రాజు జిగ్మే సింగ్యే హయాంలో భూటాన్ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య రాచరికంగా, ఆధునిక రాజ్యంగా ఎదిగిన పరిణామాన్ని మోదీ ప్రస్తావించారు. కాగా, ఢిల్లీ పేలుడు ఘటనలో మరణించిన వారికి సంతాపంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యిల్ వాంగ్‌చుక్.. ‘చాంగ్లిమెథాంగ్ స్టేడియం’లో వేలాదిమందితో ప్రార్థనా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ ఘటనతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్క నేరస్థున్నీ వేటాడుతామని, ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేశానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. సీనియర్ అధికారులతో మంగళవారం రెండుసార్లు సమీక్ష సమావేశాలు జరిపానని తెలిపారు.