PM Modi Urged: స్వదేశీకి దన్ను!
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:25 AM
అమెరికా సుంకాల వేళ.. స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలకు పిలుపిచ్చారు. గాంధీ జయంతి అక్టోబరు 2...
2న ప్రతి ఒక్కరూ ‘ఖాదీ’ కొనండి: మోదీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: అమెరికా సుంకాల వేళ.. స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ప్రధాని మోదీ మరోసారి దేశ ప్రజలకు పిలుపిచ్చారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నాడు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని కోరారు. ఇవి దేశీయ ఉత్పత్తులని సగర్వంగా చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి ‘స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం (వోకల్ ఫర్ లోకల్)’ అనే హాస్టాగ్ జోడించాలన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ ఆవిర్భవించి ఈ విజయదశమితో వందేళ్లవుతున్న సందర్భంగా ఆ సంస్థపై ప్రశంసలు కురిపించారు. క్రమశిక్షణ, నిస్వార్థ సేవే సంఘ్ బలమని తెలిపారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 126వ సంచికలో ప్రధాని ప్రసంగించారు. స్వాతంత్ర్యానంతరం ఖాదీ ఉత్పత్తుల కొనుగోలు వెలవెలబోయిందని.. గత 11 ఏళ్లలో తన పాలనలో దేశమంతా ఖాదీకి ఆకర్షితమవుతోందని తెలిపారు. చేనేత, హస్తకళల రంగాల్లో కూడా గుణాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు.
సంఘ్ అసాధారణ ప్రయాణం..
స్వయంగా ఆర్‌ఎ్‌సఎస్ ప్రచారక్ అయిన మోదీ.. దసరాకు ఆర్‌ఎ్‌సఎస్ ఏర్పాటై నూరేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ సంస్థను శతధా కొనియాడారు. సంఘ్ కార్యకర్తలకు ‘దేశమే ఫస్ట్’ అని స్పష్టంచేశారు. ‘మేధో బానిసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు 1925లో విజయదశమినాడు కేశవ్ బలిరాం హెడ్గేవార్ ఆర్‌ఎ్‌సఎ్‌సను నెలకొల్పారు. వందేళ్లుగా సంఘ్ జాతి సేవలో అవిశ్రాంతంగా నిమగ్నమైంది’ అని తెలిపారు. ఆర్‌ఎ్‌సఎస్ ప్రస్తుత చీఫ్ సర్‌సం్‌ఘచాలక్ భాగవత్ నాయకత్వాన్ని ప్రధాని కొనియాడారు.
నేవీ అధికారిణులకు ప్రత్యేక ప్రశంస
మన్ కీ బాత్ ప్రసంగం సందర్భంగా ప్రధాని భారత నౌకాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులతో ప్రత్యేకంగా సంభాషించారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్‌నా,రూప.. ప్రపంచ ప్రదక్షిణ నిమిత్తం ‘నావికా సాగర్ పరిక్రమ’లో పాలుపంచుకోవడం ద్వారా నిజమైన ధైర్యసాహసాలను, మొక్కవోని సంకల్పాన్ని ప్రదర్శించారని కొనియాడారు. ఐఎన్‌ఎ్‌సవీ ‘తరిణి’ నౌకలో వారి పరిక్రమ యాత్ర గత ఏడాది అక్టోబరు 2న గోవాలోని నేవల్ ఓషన్ సెయిలింగ్ నోడ్ నుంచి ప్రారంభమైంది. నాలుగు ఖండాలు, మూడు మహాసముద్రాలు, మూడు ద్వీపకల్పాలు, ప్రతికూల వాతావరణం, సవాళ్ల నడుమ 50 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ ఏడాది మే 29న తిరిగి గోవా తీరానికి చేరుకున్నారు.