PM Modi to Tour Five States: 5 రాష్ట్రాల్లో మోదీ పర్యటన
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:39 AM
ప్రధాని మోదీ మణిపూర్ సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మిజోరం, మణిపూర్, అసోం, పశ్చిమ బెంగాల్....
నేటి నుంచి మూడు రోజులు బిజీబిజీ
అల్లర్ల తర్వాత తొలిసారిగా మణిపూర్‌కు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ప్రధాని మోదీ మణిపూర్ సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు మిజోరం, మణిపూర్, అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్‌లో పర్యటిస్తారని, రూ.71,850 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) శుక్రవారం వెల్లడించింది. మణిపూర్‌లో 2023 మేలో జాతుల మధ్య వైరంతో హింస చెలరేగిన తర్వాత ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనుండడం ఇదే తొలిసారి. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ తొలుత శనివారం మిజోరం వెళ్లనున్నారు. ఐజ్వాల్‌లో ఉదయం రూ.9 వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి నుంచి మణిపూర్ చేరుకొని.. చురచాంద్‌పూర్‌లో మధ్యాహ్నం రూ.7,300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత రాజధాని ఇంఫాల్‌లో రూ.1,200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అసోం వెళ్తారు. సాయంత్రం గువాహటిలో జరిగే భారతరత్న భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 14వ తేదీన ప్రధాని మోదీ అసోంలో రూ.18,530 కోట్ల కీలకమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత అస్సాం బయో-ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. 15న పశ్చిమబెంగాల్‌లో ప్రధాని పర్యటించి, కోల్‌కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బిహార్ వెళ్లి.. పూర్ణియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పూర్ణియాలో దాదాపు రూ.36 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.