Share News

PM Narendra Modi criticized opposition parties: పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:35 AM

బిహార్‌ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం సుడిగాలి పర్యటన చేశారు....

PM Narendra Modi criticized opposition parties: పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం

  • వారి పిల్లలకు పదవులు ఇస్తూ మీ పిల్లల భవితను కాలరాస్తున్నారు

  • విపక్షాలపై ప్రధాని ఫైర్‌.. విపక్షాలకు ‘65 వోల్టుల’ షాకిచ్చారు

  • బిహార్‌ తొలిదశ పోలింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ

పట్నా, నవంబరు 8: బిహార్‌ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ, కాంగ్రెస్‌ సహా ఇతర విపక్షాలపై నిప్పులు చెరిగారు. సీతామర్హి, బెట్టియా జిల్లాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘వారు(విపక్ష పార్టీలు) పిల్లలకు తుపాకులు ఇస్తే.. మేం ల్యాప్‌టా్‌పలు ఇస్తున్నాం. వారే కనుక అధికారంలోకి వస్తే.. మీ తలలపై తుపాకులు ఎక్కుపెట్టి చేతులు పైకెత్తమంటారు.’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాష్ట్రంలోని యువతను విపక్ష పార్టీలు పోకిరీలుగా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‘‘ఇక్కడి కొందరు వ్యక్తులు తమ పిల్లలను ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చూడాలని భావిస్తున్నారు. కానీ, ఇదే సమయంలో మీ(ప్రజలు) పిల్లలను మాత్రం గూండాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, బిహార్‌ ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రధానంగా ఆర్జేడీని లక్ష్యంగా చేసుకుని మోదీ విరుచుకుపడ్డారు. ‘‘ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచార గీతాలు వింటే మీరు వణికిపోతారు. బిహార్‌ యువతను ఆర్జేడీ ఏం చేయాలని అనుకుంటోందో ఈ ప్రచారాలే స్పష్టం చేస్తున్నాయి. అమాయక చిన్నారులను వేదికలెక్కించి.. వారితో గ్యాంగ్‌స్టర్లుగా మారుతామని చెప్పిస్తున్నారు. ఇదీ.. ఆర్జేడీ విధానం’’ అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అభ్యర్థి నిర్వహించిన ప్రచార సభలో పదేళ్ల బాలుడు చేసిన ‘తుపాకులు, దోపిడీ’ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. బిహార్‌లో నేడు తుపాకులు ఎక్కుపెట్టే సంస్కృతి లేదన్న ప్రధాని.. యువత స్టార్టప్స్‌ కలలను సాకారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ఆయన ‘మాకు తుపాకులు పట్టుకునే సర్కారు వద్దు-మరోసారి ఎన్డీయే సర్కారే ముద్దు’ అనే నినాదం ఇచ్చారు.


వారికి నిద్రలేకుండా చేశారు!

ఈ నెల 6న జరిగిన తొలిదశ పోలింగ్‌లో 65.08 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ.. 65 వోల్టుల శక్తితో విపక్షాలకు భారీ షాక్‌ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలను చావుదెబ్బ కొట్టారు. వారికి 65 వోల్టుల శక్తితో భారీషాకిచ్చారు. నిద్ర లేకుండా చేశారు. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు’’ అని వ్యాఖ్యానించారు. మహిళల అభ్యున్నతికి తానే బ్రాండ్‌ అంబాసిడర్‌నని మోదీ అభివర్ణించారు. కొంతమంది ‘మునగడం ఎలా’ అనే విషయంపై సాధన చేస్తున్నారు.. అంటూ ఇటీవల మత్స్యకారులతో కలిసి రాహుల్‌గాంధీ చెరువులో మునిగిన చేపలు పట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.

వారిని ఓటుతో శిక్షించండి!

‘‘బిహార్‌ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఛట్‌ ఉత్సవాన్ని డ్రామా, నకిలీ అని వ్యాఖ్యానించి ఇక్కడి వారిని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా అవమానించింది. ఇది మన సెంటిమెంటును అవమానించడం కాదా?. అలాంటివారిని శిక్షించ కూడదా?. అలా శిక్షించాలంటే ప్రజాస్వామ్యంలో మీకున్న మార్గం, శక్తి ఓటే. ఆ ఓటుతోనే వారిని శిక్షించండి.’’ అని మోదీ పిలుపునిచ్చారు. వారి ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా చొరుబాటు దారులు కూడా రక్షణ పొందుతున్నారని దుయ్యబట్టారు. రెండో దశ ఎన్నికల్లో ప్రతి బూత్‌లోనూ గత ఎన్నికలకంటే కూడా 100 ఓట్లు ఎక్కువ పడేలా ప్రజలు, కార్యకర్తలు వ్యవహరించాలని ఆయన అభ్యర్థించారు.


160 సీట్లతో ఎన్డీయేకు అధికారం: అమిత్‌ షా

బిహార్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ దుకాణం మూత పడనుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి స్వీప్‌ చేస్తుందని, 160కి పైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. శనివారం పూర్ణియా, కతిహార్‌, సుపాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అమిత్‌ షా మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ కలిసి బిహార్‌లోని సీమాంచల్‌ ప్రాంతాన్ని చొరబాటుదారుల అడ్డాగా మార్చారని ఆరోపించారు. సోనియాగాంధీకి, లాలూప్రసాద్‌ యాదవ్‌ తమ కుమారుల గురించి బాధపడుతున్నారని, కానీ.. బిహార్‌లో, ఢిల్లీలో కుర్చీలు ఖాళీగా లేవని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. అయితే అమిత్‌ షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. ఏళ్ల తరబడి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే.. చొరబాట్లను ఎందుకు అరికట్టలేదని ప్రశ్నించారు.

Updated Date - Nov 09 , 2025 | 06:56 AM