PM Modi Reviews Delhi Explosion: పేలుడు ఘటనపై మోదీ ఆరా
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:03 AM
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగి వివరాలు తెలుసుకున్నారు..
పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమీక్ష
న్యూఢిల్లీ, నవంబరు 10: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోదీ పోస్ట్ పెట్టారు. ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హోంమంత్రి షాతో పాటు ఇతర అధికారులతోనూ మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి ఢిల్లీ క్రైం బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ చేరుకున్నాయని చెప్పారు. ఘటనపై ఎన్‌ఐఏ, ఎన్‌ఎ్‌సజీ, ఫోరెన్సిక్ బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. మంగళవారం ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తామన్నారు. మరోవైపు పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పేలుడు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పుకార్లను నమ్మవద్దని రేఖాగుప్త ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేలుడు ఘటనలో మరణాలు బాధాకరమంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేరళ సీఎం విజయన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితరులు పేలుడు ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.