PM Modi Launches Indigenous 4G: ఇక స్వదేశీ 4జీ!
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:56 AM
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్ స్వదేశీ 4జీ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని ఝార్సుగూడలో..
స్వదేశీ టెక్నాలజీతో బీఎ్‌సఎన్‌ఎల్ సేవలు
ఒడిశాలో ప్రారంభించిన ప్రధాని మోదీ
37,500 కోట్లతో 97,500 మొబైల్ టవర్లు
ఝార్సుగూడ, సెప్టెంబరు 27: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎ్‌సఎన్‌ఎల్ స్వదేశీ 4జీ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని ఝార్సుగూడలో ఈ సేవలను ప్రారంభించారు. అలాగే రూ.37,500 కోట్ల వ్యయంతో పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 97,500కు పైగా 4జీ మొబైల్ టవర్లను కూడా ఆయన ప్రారంభించారు. దీంతో టెలికాం పరికరాలను సొంతంగా ఉత్పత్తి చేసే చైనా, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియాల సరసన భారత్ చోటు దక్కించుకుంది. ఈ నెట్‌వర్క్ పూర్తిగా క్లౌడ్ ఆధారితమైనదని, భవిష్యత్తులో సులభంగా 5జీకి అప్‌గ్రేడ్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ కలలకు ప్రతిరూపమైన డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో ఇదొక మైలురాయిగా పేర్కొన్నారు. దీంతో 26,700కు పైగా గ్రామాల్లో 20 లక్షల మందికిపైగా కొత్త వినియోగదారులకు 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. అదేవిధంగా డిజిటల్ భారత్ నిధి ద్వారా 30వేల గ్రామాలను అనుసంధానించే లక్ష్యంతో 100శాతం 4జీ శాచ్యురేషన్ నెట్‌వర్క్‌తో పాటు ఒడిశాలో రూ.60వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. 8ఐఐటీల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.37,500 కోట్ల వ్యయంతో 97,500కు పైగా 4జీ మొబైల్ టవర్లు ఏర్పాటు. వీటిలో చాలవరకూ సౌర శక్తితో పనిచేసేవి కావడంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికం సైట్‌ల క్లస్టర్‌గా గుర్తింపు. 100శాతం 4జీ శాచ్యురేషన్ నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా దాదాపు 30వేల గ్రామాలకు 4జీ సేవలు.
క్లౌడ్ ఆధారిత నెట్‌వర్క్ కావడంతో భవిష్యత్తులో సులభంగా 5జీకి అప్‌గ్రేడ్ చేసే అవకాశం.
సహకరించిన టెక్ దిగ్గజాలు
స్వదేశీ 4జీ నెట్‌వర్క్ రూపకల్పనలో బీఎ్‌సఎన్‌ఎల్‌తో పాటు టెక్ దిగ్గజాలైన టీసీఎస్, సీ-డాట్, తేజస్ నెట్‌వర్క్ లిమిటెట్ కీలక పాత్ర పోషించాయి.
టీసీఎస్ - డేటా సెంటర్ల ఏర్పాటు, నెట్‌వర్క్ నిర్వహణ
తేజస్ నెట్‌వర్క్ - రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఆర్‌ఏఎన్)
ప్రజలను దోచుకున్న కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా దోచుకుందని మోదీ ఆరోపించారు. అల్పాదాయ వర్గాలను కూడా వదలకుండా వారిపైనా పన్నుల భారం మోపిందని మండిపడ్డారు. ఒడిశాలోని ఝార్సుగూడలో శనివారం నిర్వహించిన ‘నమో యువ సమాబేశ్’లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో ప్రబలంగా ఉన్న దోపిడీ సంస్కృతి నుంచి బీజేపీ రక్షించిందని అన్నారు. ప్రజలను దోచుకోవడానికి ఏ అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదిలిపెట్టలేదని విమర్శించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా బీజేపీ ప్రభుత్వం ఆదాయాన్ని, పొదుపును రెట్టింపు చేసిందని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం రెండు సెమీ కండక్టర్ యూనిట్లను మంజూరు చేసిందని, అర్థిక కారిడార్ కోసం కూడా ప్రణాళికలు ఉన్నాయన్నారు.