PM Modi: ఈ ఏడాది భారత్‌కు గర్వకారణం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:14 AM
భారత్ గర్వించదగిన, చిరస్మరణీయమైన ఎన్నో మైలురాళ్లను 2025 అందించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ప్రసారమైన ఈ ఏడాది చివరి మన్ కీ బాత్...
ఆపరేషన్ సిందూర్ నుంచి ప్రపంచ కప్ వరకూ 2025లో ఎన్నో మైలురాళ్లు అధిగమించాం
ప్రతిచోటా భారత దేశ ప్రభావం స్పష్టం
కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి
ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’లో మోదీ
న్యూఢిల్లీ, డిసెంబరు 28: భారత్ గర్వించదగిన, చిరస్మరణీయమైన ఎన్నో మైలురాళ్లను 2025 అందించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ప్రసారమైన ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ 129వ ఎపిసోడ్‌లో ఆయా కీలక ఘట్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు. జాతీయ భద్రత, క్రీడలు, సాంకేతిక ఆవిష్కరణలతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఈ ఏడాది భారతదేశం ప్రభావం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ప్రతి భారతీయుడికి గర్వకారణమైన ఆపరేషన్ సిందూర్... భద్రత విషయంలో దేశం రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. జాతీయ గేయమైన వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఇదే స్ఫూర్తి కనిపించిందని చెప్పారు. పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని, మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకొని క్రీడల పరంగా ఈ ఏడాదిని చిరస్మరణీయంగా మార్చాయని అన్నారు. అంతేకాకుండా, మహిళల అంధుల జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించి చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఆసియా కప్ టీ20లో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడిందని, పారా అథ్లెట్లు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పతాకల పంట పండించారని మోదీ కొనియాడారు. సైన్స్, అంతరిక్ష రంగాల్లోనూ భారత్ గొప్ప ముందడుగు వేసిందని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుభాన్షు శుక్లా నిలిచారని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశంలోని చిరుతపులుల సంఖ్య 30కి పైగా పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా 2025లో జరిగిన వివిధ కార్యక్రమాలను మోదీ ప్రస్తావించారు. మన సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీకగా ఏడాది ప్రారంభంలో ప్రయాగరాజ్‌లో నిర్వహించిన మహా కుంభమేళా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందని అన్నారు. అయోధ్య రామమందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువు గర్వపడేలా చేసిందన్నారు. ‘‘2025 భారత్‌కు మరింత ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. సరికొత్త ఆశలు, సంకల్పాలతో నూతన సంవత్సరం 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉంది’ అని మోదీ అన్నారు.
భారత్‌వైపు ఆశగా చూస్తున్న ప్రపంచం
ప్రపంచం మొత్తం ఈ రోజు భారత్‌వైపు ఎంతో ఆశగా చూస్తోందని, దేశంలోని యువ శక్తే దీనికి అతిపెద్ద కారణమని మోదీ అభివర్ణించారు. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంతో పాటు ‘యంగ్ లీడర్స్ డైలాగ్’ను నిర్వహిస్తామని, అందులో తాను కూడా తప్పనిసరిగా పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవిష్కరణలు, ఫిట్‌నెస్, స్టార్ట్‌పలు, వ్యవసాయం తదితర కీలక అంశాలపై యువత తమ ఆలోచనలు పంచుకుంటారని వెల్లడించారు. భారతీయ సంస్కృతి, భాషలను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా కొత్త తరాన్ని తమిళ భాషతో అనుసంధానించడానికి ఫిజీలో జరుగుతున్న ప్రయత్నాలను ప్రశంసించారు. కాగా, యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకంపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఇష్టానుసారంగా తీసుకొనేవి కావని, డాక్టర్ సలహా మేరకే వాడాలని ప్రజలను కోరారు.
లేస్ పరిశ్రమకు కేరాఫ్ నరసాపురం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వద్దనున్న సీతారాంపురం గ్రామం లేస్ పరిశ్రమకు కేరా్‌ఫగా నిలుస్తోంది. దాదాపు 160 ఏళ్ల క్రితం ఐర్లాండ్ దేశస్థులు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడి మహిళలకు లేసు అల్లికలపై శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి కల్పించడంతో పాటు అల్లికలను విదేశాలకు ఎగుమతి చేశారు. ఇలా మొదలైన లేస్ పరిశ్రమ 2010కల్లా వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఏటా రూ.150 కోట్ల ఎగుమతులు జరిగేవి. 2010లో ప్రభుత్వం నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో లేస్ పార్కును ఏర్పాటుచేసి మహిళలకు అల్లికల్లో ఆధునిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. నరసాపురం లేస్‌కు జీఐ ట్యాగ్ లభించడం మరింత గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నరసాపురం లేస్ క్రాఫ్ట్ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోందని మోదీ ప్రశంసించారు.
దుబాయ్‌లో కన్నడ పాఠశాలపై ప్రధాని ప్రశంస
దుబాయ్‌లో కన్నడ పాఠశాల ఏర్పాటు పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు అందజేశారు. ప్రవాస కన్నడిగుల కోసం కన్నడ పాఠశాల కొనసాగించడం సంతోషకరమన్నారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో భాగంగా కన్నడిగుల భాషాభిమానాన్ని ప్రధాని కొనియాడారు. దుబాయ్‌లో నివసించే కన్నడిగులు కన్నడ భాషను మరువరాదని ఓ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేశారని, పిల్లలకు కన్నడ రాయడం, చదవడం, మాట్లాడడం నేర్పుతున్నారని,. సుమారు వెయ్యిమంది పిల్లలకు కన్నడ భాష నేర్పించే ప్రక్రియ జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.