Share News

PM Modi: మన అతిపెద్ద శత్రువు..ఇతర దేశాలపై ఆధారపడటమే

ABN , Publish Date - Sep 21 , 2025 | 04:28 AM

ఇతర దేశాలపై ఆధారపడడమే భారత్‌ అతిపెద్ద శత్రువు అని ప్రధాని మోదీ అన్నారు. చిప్స్‌(సెమీకండక్టర్‌) నుంచి షిప్స్‌ వరకు స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకుని ఆత్మనిర్భరతను చాటడడమే దీనికి ఏకైక పరిష్కారమని తెలిపారు.

PM Modi: మన అతిపెద్ద శత్రువు..ఇతర దేశాలపై ఆధారపడటమే

  • ఆత్మనిర్భరతే ఏకైక పరిష్కారం

  • చిప్స్‌ నుంచి షిప్స్‌ వరకు స్వదేశీ

  • ఉత్పత్తులకు పెద్దపీట వేయాల్సిందే

  • గుజరాత్‌ పర్యటనలో మోదీ

భావ్‌నగర్‌, సెప్టెంబరు 20: ఇతర దేశాలపై ఆధారపడడమే భారత్‌ అతిపెద్ద శత్రువు అని ప్రధాని మోదీ అన్నారు. చిప్స్‌(సెమీకండక్టర్‌) నుంచి షిప్స్‌ వరకు స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసుకుని ఆత్మనిర్భరతను చాటడడమే దీనికి ఏకైక పరిష్కారమని తెలిపారు. శనివారం గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని ‘సముద్రం ద్వారా సమృద్ధి’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం.. ఆత్మనిర్భరతేనని చెప్పారు. ‘‘140 కోట్ల మంది ప్రజల భవితను విదేశీ శక్తులకు వదిలేయం. దేశ అభివృద్ధి సంకల్పం.. విదేశాలపై ఆధారపడి ఉండదు. భవిష్యత్తు తరాలను ఇతరులపై నెట్టేయం’’ అని ప్రధాని తేల్చి చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలించిన పార్టీ.. యువత సామర్థ్యాన్ని తొక్కిపెట్టిందంటూ కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ‘లైసెన్స్‌ రాజ్‌’తో పరిమితులు విధించి యువతను నిర్వీర్యం చేసిందన్నారు. లైసెన్స్‌-కోటా కారణంగా దీర్ఘకాలిక చిక్కుముడులు ఏర్పడి, ప్రపంచ మార్కెట్‌లో ఒంటరిగా నిలిచిపోయామన్నారు. గత ప్రభుత్వాల విధానాలు.. దేశ సామర్థ్యాన్ని ఎలా దెబ్బతీశాయో చెప్పడానికి నౌకా రంగమే ప్రధాన ఉదాహరణ అని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో స్వదేశీ నౌకా నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి, విదేశీ నౌకలను అద్దెప్రాతిపదికన వినియోగించుకోవడం వల్ల ఏటా రూ.6 లక్షల కోట్లను విదేశీ కంపెనీలకు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే సముద్రయాన రంగంలో వరుస సంస్కరణలు తీసుకువచ్చినట్టు ప్రధాని తెలిపారు. పెద్ద పెద్ద నౌకలకు మౌలిక సదుపాయాల హోదా కల్పించడం ద్వారా సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నామని వివరించారు. ‘‘తద్వారా నౌకా నిర్మాణ కంపెనీలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతేకాదు, వన్‌ నేషన్‌-వన్‌ డాక్యుమెంట్‌(ఒక దేశం-ఒక పత్రం), వన్‌ నేషన్‌-వన్‌ పోర్ట్‌(ఒక దేశం-ఒక నౌకాశ్రయం) విధానాన్ని అమలు చేస్తున్నామని, తద్వారా వ్యాపార, వాణిజ్యాలు అత్యంత సులభతరం అవుతాయని తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 04:29 AM