Share News

Prime Minister Narendra Modi: మీరు పని చేయట్లేదు

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:05 AM

దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్నదని.. రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణలో....

Prime Minister Narendra Modi: మీరు పని చేయట్లేదు

  • తెలంగాణ బీజేపీ నేతలపై మోదీ ఆగ్రహం

  • ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఘోరం

  • ముఠా తగాదాలు పెరిగాయి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన చాన్స్‌ చేజార్చుకున్నాం

  • మన సోషల్‌ మీడియాకంటే అసదుద్దీన్‌ ఒవైసీ సోషల్‌ మీడియా బలంగా ఉంది

  • కనీసం ఆయనను చూసైనా నేర్చుకొండి.. తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్‌

  • పార్టీ బలంగా లేకపోవడంపై రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులపై ప్రధాని ధ్వజం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్నదని.. రాష్ట్ర ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ.. పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదని, ముఠా తగాదాలు పెరిగాయని.. 8 మంది ఎంపీలున్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించట్లేదని అసంతృప్తి వెలిబుచ్చారు. తన అంచనా ప్రకారం బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా.. నాయకులు పనిచేయకపోవడం వల్లనే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అండమాన్‌ ఎంపీలకు గురువారం పార్లమెంట్‌ అనెక్సీలో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ మూడు చోట్లా పార్టీ పనితీరుపై సమీక్ష జరిపారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంపీల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్న ఆయన.. తెలంగాణాలో ఎందుకు వెనుకబడిపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్‌ పెరిగేందుకు మంచి అవకాశం ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమవుతోందని, ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు ఎనిమిది మంది ఎంపీలున్నా పార్టీ బలహీనంగా ఉన్నదని ధ్వజమెత్తారు. దీనిపై ఒక ఎంపీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా.. ‘‘మేరే కో సబ్‌ కుచ్‌ మాలూం’’ అని మోదీ ఘాటుగా స్పందించినట్లు సమాచారం. అలాగే, ఇద్దరు కేంద్రమంత్రులను ఉద్దేశించి.. ‘‘మీరు ఢిల్లీలో తక్కువ, హైదరాబాద్‌లో ఎక్కువ గడుపుతున్నారు. అయినా పార్టీ బలంగా లేదు’’ అని మందలించినట్లు తెలిసింది. ‘‘బలమైన టీమ్‌ను ఏర్పరచుకుని పనిచేయడానికి ఏమి అడ్డొచ్చింది?’’ అని ప్రశ్నించిన మోదీ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామ’’ని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రూపు తగాదాలు వీడి ఐకమత్యంతో పనిచేయాలని, పార్టీ బలపడేలా దూకుడుగా పనిచేయాలని, కార్యకర్తలతో టిఫిన్‌ బైఠక్‌లు నిర్వహించాలని, యువతకు చేరువ కావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఒకప్పుడు ఒడిశాలో ఉనికిలో లేకపోయినా అక్కడ బీజేపీ నేతలు సంఘటితంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ఆయన ప్రస్తావించారు.


సామాజిక మాధ్యమాల్లోనూ..

‘‘కనీసం సోషల్‌ మీడియాలో కూడా మీరు చురుగ్గా. మీ సోషల్‌ మీడియా ప్రకటనలు, వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ తన సోషల్‌ మీడియాను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారు. కనీసం ఆయనను చూసైనా మీరు నేర్చుకోండి..’’ అని మోదీ తెలంగాణ ఎంపీలకు చురకలంటించినట్లు తెలిసింది. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండాలని మోదీ చెబుతుండగా ఒక ఎంపీ లేచి.. తాను చురుగ్గానే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మోదీ.. ‘‘నాకు తెలుసు మీకు స్టైల్‌ ఎక్కువ, పని తక్కువ’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో వందేమాతరం, ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) అంశాలపై జరిగిన చర్చ అనంతరం, పార్టీ ఎంపీలు వాటిని సోషల్‌ మీడియాలో పంచుకోకపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని మోదీ ఆదేశించారు. జాతీయ పరిణామాలను, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని హితవు పలికారు. ఇలా ప్రధానమంత్రి దాదాపు అరగంటసేపు క్లాస్‌ తీసుకున్నారని.. ఆ సమయంలో ఎంపీలంతా దిగ్ర్భాంతికి గురైనట్లు వింటూ పోయారని ఒక బీజేపీ ఎంపీ చెప్పారు. ఇక.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వ పనితీరు పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏపీలో చంద్రబాబుతో కలిసి పనిచేయడం మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. గతంలో కంటే ఏపీలో పార్టీ బలపడుతోందని, ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని కేంద్రమంత్రి భూపతి రాజు మోదీకి చెప్పినట్లు సమాచారం. పార్టీపరంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల స్పందన గురించి.. ఏపీ బీజేపీ ఎంపీలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర పరిపాలన, అభివృద్ధిపై కూడా తనకు మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని, పెట్టుబడులు కూడా భారీగా వస్తున్నాయని ఆయన అన్నట్లు తెలిసింది. వైసీపీ అధినేత జగన్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టాలని సూచించినట్లు తెలిసింది.

Updated Date - Dec 12 , 2025 | 05:05 AM