Vice President: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 09:31 PM
భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమైందని ప్రధాని మోదీ ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 'ప్రజా జీవితంలో మీ దశాబ్దాల గొప్ప అనుభవం దేశ పురోగతికి గణనీయంగా దోహదపడుతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు నా శుభాకాంక్షలు.' అని భారత రాష్ట్రపతి ఆకాంక్షించారు.
భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ జీవితం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమైందని ప్రధాని మోదీ ప్రశంసించారు. అణగారిన వర్గాల సాధికారతకు కృషి చేసిన వ్యక్తి రాధాకృష్ణన్ అని మోదీ అన్నారు. అత్యుత్తమ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ నిలుస్తారని భావిస్తున్నానని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలను రాధాకృష్ణన్ బలోపేతం చేస్తారని ఆశిస్తున్నానని మోదీ చెప్పారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్ కి అభినందనలు తెలిపారు. 'సమాజంలో అట్టడుగు స్థాయి నుండి ఎదిగిన నాయకుడిగా మీ వివేకం, పరిపాలన గురించిన లోతైన జ్ఞానం, అణగారిన వర్గాలకు సేవ చేయడంలో సహాయపడతాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ఎగువ సభ పవిత్రతకు సంరక్షకుడిగా మీ ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.' అని అమిత్ షా అన్నారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి.. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 'మీ జ్ఞానం, దార్శనికత కచ్చితంగా దేశానికి మార్గనిర్దేశం చేస్తుంది' అని సునీల్ శెట్టి అభిలషించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికైన కొత్త ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు.. గౌరవాన్ని ఇస్తారని, పాలక వర్గ ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నామని ఖర్గే తన సందేశంలో పేర్కొన్నారు.