Share News

PM Modi: కలిసి పనిచేద్దాం

ABN , Publish Date - May 25 , 2025 | 04:34 AM

ప్రధాని మోదీ కేంద్రం, రాష్ట్రాలు టీమిండియా స్ఫూర్తితో కలిసి పనిచేస్తే అభివృద్ధిలో ఏ అడ్డుకూడదు అని అన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో 2047కి వికసిత భారత్‌ లక్ష్యంగా ప్రకటించారు, కానీ కాంగ్రెస్‌ దీనిపై విమర్శలు చేసింది.

PM Modi: కలిసి పనిచేద్దాం

టీమిండియా స్ఫూర్తి చాటుదాం.. సాధ్యంకాని లక్ష్యమంటూ ఉండదు

పెట్టుబడులకు పెద్దపీట వేయండి

వికసిత భారత్‌ ప్రతి ఒక్కరి లక్ష్యం

రాష్ట్రాల అభివృద్ధితోనే ఇది సాధ్యం

నీతి ఆయోగ్‌ భేటీలో రాష్టాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ, మే 24: ‘‘రండి.. కలిసి పనిచేద్దాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ‘టీమిండియా’ స్ఫూర్తితో పనిచేస్తే సాధ్యం కాని లక్ష్యమంటూ ఏమీ ఉండదు.’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన 10వ నీతి ఆయోగ్‌ పాలక సమావేశం జరిగింది. ‘వికసిత్‌ భారత్‌ 2047 కోసం వికసిత రాష్టాలు’ అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో మరింత వేగం పుంజుకోవాల్సి ఉందన్నారు. ‘‘అభివృద్ధి పనుల వేగం మరింత పెరగాల్సి ఉంది. కేంద్రం, అన్ని రాష్ట్రాలు టీమిండియా స్ఫూర్తితో కలిసి పనిచేస్తే అసాధ్యమంటూ ఏమీ ఉండదు.’’ అని వ్యాఖ్యానించారు. ‘‘వికసిత భారత్‌.. అనేది ప్రతి భారతీయుడి లక్ష్యం. ఈ క్రమంలో ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే.. భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష.’’ అని ప్రధాని ఉద్ఘాటించారు. ప్రతి రాష్ట్రం, ప్రతి నగరం, ప్రతి నగరపాలక సంస్థ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేది ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యసాధనకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ‘వికసిత భారత్‌’ కోసం 2047 వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలు, మౌలిక వసతులతో ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.


‘‘ఒక రాష్ట్రం-ఒక ప్రపంచ గమ్యస్థానం.. స్ఫూర్తిని అందిపుచ్చుకుని అభివృద్ధి చేస్తే పొరుగున ఉన్న నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయి.’’ అని చెప్పారు. దేశంలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతోందని, ‘ఫ్యూచర్‌ రెడీ సిటీస్‌’ దిశగా కలిసి పనిచేయాల్సి ఉందని తెలిపారు. వృద్ధి, సృజనాత్మకత, సుస్థిరత అభివృద్ధికి చోదక శక్తులని ప్రధాని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో మహిళల పాత్రను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని రాష్ట్రాలను ప్రధాని కోరారు. విధానపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా.. పెట్టుబడులకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగు పరిచేందుకు రెడ్‌ కార్పెట్‌ పరవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా విద్య, వ్యవసాయం, ప్రజారోగ్యంపై రాష్ట్రాలు ప్రధానంగా దృష్టిసారించాలని ప్రధాని సూచించారు.

hk.jpg

కాగా, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఆ సీఎంలు దూరం

ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య.. బిజీగా ఉన్న కారణంగా హాజరుకాలేదు. అయితే, ఆయన తన సందేశాన్ని లిఖిత పూర్వకంగా పంపించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా హాజరుకాలేదు. తనబదులుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ను పంపించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న పుదుచ్చేరి సీఎం రంగస్వామి, బిహార్‌ సీఎం నితీశ్‌లు గైర్హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఇదో.. వంచన: కాంగ్రెస్‌

నీతి ఆయోగ్‌ పాలకమండలిపై కాంగ్రెస్‌ పార్టీ నిశిత విమర్శలు చేసింది. దీనిని ‘అయోగ్యమండలి’గా అభివర్ణించింది. అంతేకాదు.. ఈ సమావేశాన్ని ‘వంచన, దారిమళ్లింపు’ భేటీగా దుయ్యబట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు. ‘‘వికసిత భారత్‌ కోసం ప్రధాని అధ్యక్షతన భేటీ అయ్యారు. కానీ, అధికారంలో ఉన్నవారే తమ మాటలు, చేతల ద్వారా సామాజిక సామరస్యాన్ని ధ్వంసం చేస్తుంటే.. వికసిత భారత్‌ ఎలా సాధ్యమవుతుంది?.’’ అని జైరాం రమేశ్‌ ‘ఎక్స్‌’లో ప్రశ్నించారు. ‘‘కొందరి దగ్గరే సంపద పోగుపడుతోంది. ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వికసిత భారత్‌ సాధ్యమేనా?’’ అని నిలదీశారు. ‘‘నేడు సమావేశమైన నీతి ఆయోగ్‌ మండలి.. ఓ అయోగ్య మండలి’’ అని జైరాం వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్‌ పతనానికి జైరాం చాలు: బీజేపీ

నీతి ఆయోగ్‌ భేటీపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. టీమిండియా స్ఫూర్తిని చాటేలా నిర్వహించిన నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలోనూ ఆయన తప్పులు వెతకడం, వివాదాలు సృష్టించడం దారుణమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్‌ షహన్వాజ్‌ హుస్సేన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ పతనానికి జైరాం ఒక్కరు చాలని వ్యాఖ్యానించారు. కాగా, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాట్లాడుతూ.. హరియాణాతో జల వివాదాన్ని ప్రస్తావించారు. భాక్రా-నంగల్‌ డ్యామ్‌ నుంచి నీటిని ఇచ్చేందుకు అసలు తమ వద్ద నీరు ఉంటేనే కదా? అని ప్రశ్నించారు.

పన్నులో వాటా 50 శాతం: స్టాలిన్‌

నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీలో పాల్గొన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌.. రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాలపై ప్రశ్నించారు. ‘‘చట్టబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయాల్సి రావడం, వ్యాజ్యాలకు దిగడం, ఏం బాగోలేదు. భారత దేశం వంటి సమాఖ్య ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలు ఈ విధంగా దేబిరించాలా?. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలే కాదు.. దేశ అభివృద్ధికి కూడా విఘాతం ఏర్పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50ు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన 41ు మేరకైనా పన్నులు తమకు తిరిగి ఇవ్వడం లేదని.. కేవలం 33.16 శాతం మేరకే విదిలిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఒక వైపు రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటాల్లో కోత పెడుతున్నారు. మరోవైపు.. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను భారీగా పెంచుతున్నారు. ఇది రాష్ట్రాలపై మోపుతున్న అదనపు భారం కాదా?!’’ అని స్టాలిన్‌ ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..

Updated Date - May 25 , 2025 | 05:51 AM