Nitin Gadkari: డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:35 AM
పెట్రోల్‌లో 20ు ఇథనాల్ (ఈ20)ను కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం...
ఆ ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ
రాజకీయంగా లక్ష్యం చేసుకున్నారు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌లో 20ు ఇథనాల్ (ఈ20)ను కలపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై డబ్బులిచ్చి సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయించారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తనను రాజకీయంగా లక్ష్యం చేసుకుని ఆ ప్రచారం జరిగిందన్నారు. ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ వల్ల మైలేజీ తగ్గుతుందన్నది అవాస్తవమని తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన భారత ఆటోమొబైల్ తయారీదారుల సొసైటీ 65వ వార్షిక సమావేశంలో గడ్కరీ మాట్లాడారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ, ఇతర శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ప్రతి చోటా లాబీలు, ప్రయోజనాలు ఉంటాయన్నారు. అలాగే పెట్రోల్ లాబీ చాలా బలమైనదని, అందులో ధనవంతులు ఉన్నారని పేర్కొన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఇథనాల్ మిశ్రమం వల్ల ఎటువంటి సమస్యలు రావని అన్ని పరీక్షా సంస్థలు నిర్థారించాయన్నారు. భారత వాహన పరిశోధన సంఘం (ఏఆర్‌ఏఐ) ఈ20 వినియోగంపై స్పష్టతనిచ్చిందని చెప్పారు. భారత్ ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఆర్థికవ్యవస్థ, పర్యావరణానికి భారంగా మారిన శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.