parliamentary panel: ప్రవేశ పరీక్షలకు రాత విధానమే మేలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:58 AM
ప్రవేశ పరీక్షలను రాతపూర్వక విధానంలో నిర్వహిస్తే మంచిదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. యూపీఎస్సీ, సీబీఎస్సీ బోర్డులు ఎలాంటి పేపరు లీకుల బెడద....
పార్లమెంటరీ కమిటీ సిఫార్సు.. ఎన్‌టీఏ తీరుపై అసంతృప్తి
న్యూఢిల్లీ, డిసెంబరు 8: ప్రవేశ పరీక్షలను రాతపూర్వక విధానంలో నిర్వహిస్తే మంచిదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. యూపీఎస్సీ, సీబీఎస్సీ బోర్డులు ఎలాంటి పేపరు లీకుల బెడద లేకుండానే సమర్థంగా రాత పూర్వక పరీక్షలు జరుపుతున్నందున అలాంటి విధానాన్ని పాటించడం మేలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు సూచించింది. పెన్-పేపరు విధానంలో పరీక్ష పేపర్ల లీకుకు అవకాశం ఉందని, అదే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్-సీబీటీ) జరపాలనుకుంటే ఎవరూ కనిపెట్టలేని రీతిలో హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకొని లిఖితపూర్వక విధానాన్నే అమలు చే యడమే మంచిదని అభిప్రాయపడింది. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో విద్య, మహిళా-శిశు సంక్షేమం, యువజన వ్యవహారాలు, క్రీడలపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తాజాగా సమర్పించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. ఒకవేళ కంప్యూటర్ ద్వారా నిర్వహించాల్సి వస్తే ప్రయివేటు సంస్థల సెంటర్లకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వ సంస్థల సెంటర్లలోనే నిర్వహించాలని తెలిపింది. గత ఆరేళ్లలో ఎన్‌టీఏ ఫీజుల రూపంలో రూ.3,512.88 కోట్లను వసూలు చేసిందని, అందులో రూ.3,064.77 కోట్లను ఖర్చు చేసిందని తెలిపింది.