Parliament Winter Session: చివరి రోజూ గందరగోళమే!
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:21 AM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడినట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా.....
పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ, డిసెంబరు 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడినట్లు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిబంధనలను రాష్ట్రాలకు నష్టం కలిగించే విధంగా మార్చినందుకు నిరసనగా విపక్షాలు శుక్రవారం సభా కార్యక్రమాలను జరగనీయలేదు. దాంతో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. డిసెంబరు 1 నుంచి మొత్తం 15 రోజులపాటు పార్లమెంటు సమావేశాలను నిర్వహించారు. ఢిల్లీ కాలుష్యం మీద శుక్రవారం చివరి రోజు చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించినప్పటికీ విపక్షాల నిరసనల కారణంగా సమావేశాలనే నిరవధికంగా వాయిదా వేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం సవరణ బిల్లు సహా 8బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అణు విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లు, బీమారంగంలో 100ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతి బిల్లు ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. యూజీసీ, ఏఐసీటీఈ లాంటి సంస్థలన్నింటినీ కలిపి వికాస్ భారత్ శిక్షా అధిష్ఠాన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనకు పంపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అధికార, విపక్షానికి తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాహుల్‌గాంధీ జర్మనీ పర్యటనలో ఉండటంతో కాంగ్రెస్ తరఫున ప్రియాంక హాజరయ్యారు.