SIR Debate Set: ఎస్‌ఐఆర్‌పై చర్చించేందుకు అధికార ఎన్డీయే అంగీకారం..
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:31 AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ...
8న వందేమాతరం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ
స్పీకర్ నేతృత్వంలో జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయం
ఇక సజావుగా సభలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
పార్లమెంటు సమావేశాల రెండో రోజూ గందరగోళం
న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎ్‌సఐఆర్)పై చర్చకు కేంద్రం అంగీకరించడంతో ప్రతిష్టంభనకు తెరపడింది. అయితే.. ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేకంగా కాకుండా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై చర్చిస్తామని కేంద్రం స్పష్టతనిచ్చింది. ఎస్‌ఐఆర్‌పై అత్యవసరంగా చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో..ఈ సెషన్ తొలిరోజులాగానే మంగళవారం సైతం ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. భేటీ ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఎన్నికల సంస్కరణలపై డిసెంబరు 9న చర్చించనున్నట్టు ఆయన ఆ పోస్టులో తెలిపారు. ‘‘డిసెంబర్ 8వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై.. డిసెంబర్ 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో చర్చించాలని నిర్ణయించాం’’ అని వివరించారు. ఎన్నికల సంస్కరణలపై అవసరమైతే రెండో రోజూ చర్చించేందుకు అధికారపక్షం అంగీకరించిందని కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేష్ మీడియాకు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండోరోజూ వాయిదాల పర్వం కొనసాగింది. ఎస్‌ఐఆర్ అంశం ఉభయసభలనూ కుదిపేసింది. ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని పట్టుబడుతూ మంగళవారం సైతం విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా.. జార్జియన్ పార్లమెంట్ అధ్యక్షులు షల్వా పాపువాష్విలీ నేతృత్వంలోని జార్జియా పార్లమెంట్ బృందానికి స్వాగతం తెలిపారు. ఇంతలోనే.. ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షం పట్టుబట్టడంతో కేవలం 16 నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.
మళ్లీ సభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సహా ఇతర విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రాజ్యసభలోనూ ఎస్‌ఐఆర్‌పై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. తొలుత రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ జార్జియా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జీరో అవర్‌ను ప్రారంభించారు. వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఎస్‌ఐఆర్ సహా ఇతర అంశాలపై చర్చకు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విపక్షాల నినాదాలతో సభను వాయిదా వేశారు.
విపక్షాల ఆందోళన
ఎస్‌ఐఆర్‌పై చర్చించాలనే డిమాండ్‌తో మంగళవారం సైతం విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. ఉదయం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మకర ద్వారం ముందు నిరసన తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రియాంక గాంధీ, కనిమొళి, టీఆర్ బాలు, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సహా ఇతర సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు, ‘స్టాప్ ఎస్‌ఐఆర్ - స్టాప్ ఓట్ చోరీ’ అని రాసి ఉన్న భారీ బ్యానర్ పట్టుకుని నినాదాలు చేశారు.