Fake News: భారత్‌పై పాక్ దుష్ప్రచార యుద్ధం
ABN , Publish Date - May 01 , 2025 | 05:28 AM
పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. భారత ప్రభుత్వం దీనిని ఖండించి, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ద్వారా నకిలీ వార్తలను బయటపెడుతోంది.
యుద్ధానికి ఆర్మీ సిద్ధంగా లేదని.. రక్షణ సమావేశంలో తేల్చారంటూ నకిలీ పత్రాల సర్క్యులేషన్
పహల్గాం దాడికి భద్రతా వైఫల్యమే కారణమంటూ జనరల్ సుచీంద్రను తొలగించారనే వదంతులు
అవన్నీ అవాస్తవాలని తేల్చిన పీఐబీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ దుర్నీతిపై చర్చ జరుగుతుండటం, భారత్ తీవ్ర చర్యలు చేపట్టిన నేపథ్యంలో... పాకిస్థాన్ తప్పుడు ప్రచారాలకు దిగింది. ఆ దేశానికి చెందిన మీడియా, సోషల్ మీడియా ఖాతాల ద్వారా అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ దుష్ప్రచారం నిగ్గు తేల్చి.. నకిలీ వార్తలని స్పష్టం చేస్తూ వస్తోంది. అయినా పాక్ నుంచి ఇలాంటి తప్పుడు ప్రచారం మరింతగా సాగుతూనే ఉంది. భారత సైన్యం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. కేంద్ర సైబర్ నిఘా సంస్థలు ఇలాంటి తప్పుడు ప్రచారంపై చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టి, తగిన చర్యలు చేపట్టనున్నాయని వెల్లడించాయి. పౌరులెవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించాయి. అసలు పహల్గాం ఉగ్రదాడికి స్థానిక ఉగ్రవాదులే కారణమని, భద్రతా వైఫల్యంతోనే దాడి జరిగిందని భారత్ తేల్చిందని.. అందుకే నార్తర్న్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ సుచీంద్ర కుమార్‌ను పదవి నుంచి తొలగించి, విచారణ చేపట్టారని పాక్ మీడియా, సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టింది. నిజానికి సుచీంద్రకుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో.. ఆ స్థానంలో లెఫ్టినెంట్ ప్రతీక్ శర్మకు బాధ్యతలు అప్పగించారు.
అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న ఐఎన్‌ఎ్‌స విక్రాంత్ యుద్ధ నౌకను పేల్చివేస్తామంటూ యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరించారని, దానికితోడు యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం జరగడంతో.. భారత్ దాన్ని వెనక్కి పిలిపించిందంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ అవసరమైతే పాకిస్థాన్‌పై దాడి చేయడానికి వీలుగా ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ను అరేబియా సముద్రంలోనే మోహరించి ఉంచారు.
ఏవో చిన్నపాటి దాడులు తప్ప.. పాక్‌పై పూర్తిస్థాయిలో దాడికి ఆర్మీ సిద్ధంగా లేదని యుద్ధ సన్నాహాల సమావేశంలో తేల్చారంటూ.. కొన్ని నకిలీ పత్రాలను పాక్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేస్తున్నారు. అవి తప్పుడు పత్రాలని పీఐబీ తేల్చింది.
ఇక కశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో ఎల్వోసీ వెంట భారత రాఫెల్ యుద్ధ విమానాన్ని పాక్ కూల్చివేసిందంటూ ఓ వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు. నిజానికి అది గత ఏడాది మహారాష్ట్రలో కూలిపోయిన సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం తాలుకు వీడియోగా తేల్చారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..