Pakistan Prime Minister: తటస్థ విచారణకు సిద్ధం
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:25 AM
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, తటస్థ విచారణకు సిద్ధమన్నారు. భారత్‌పై సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విమర్శించారు.
విశ్వసనీయ దర్యాప్తులో మేం పాలు పంచుకుంటాం
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్ర మారణకాండపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పందించారు. ఈ ఘటనపై తటస్థ విచారణకు తాము సిద్ధమేనని తెలిపారు. విశ్వసనీయ దర్యాప్తులో పాలు పంచుకుంటామని చెప్పారు. శనివారం.. పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తున్‌ఖ్వాలోని మిలిటరీ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో షెహ్‌బాజ్ పాల్గొన్నారు. ‘‘పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మన దేశం మరోసారి నిందలు మోయాల్సి వచ్చింది. ఈ నిందలను శాశ్వతంగా అరికట్టాలి. బాధ్యతాయుతమైన దేశంగా మన పాత్రను కొనసాగించాలి. ఈ క్రమంలో ఎలాంటి తటస్థ, పారదర్శక, విశ్వసనీయ విచారణలోనైనా పాకిస్థాన్ పాలు పంచుకుంటుంది.’’ అని షరీఫ్ తెలిపారు. అంతేకాదు.. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని తమ దేశం ఖండిస్తుందని చెప్పారు. అయితే, అదేసమయంలో దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి దుస్సాహసం జరిగినా.. పాకిస్థానీ సాయుధ దళాలు దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘మన దేశ సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం’’ అని షరీఫ్ చెప్పారు. సింధు నది జలాలపై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఏకపక్ష నిర్ణయమన్నారు. ఇలాంటి నిర్ణయాలు తగవని చెప్పారు. వీటి వల్ల యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్