Share News

Pakistan Cyber Attacks: పది రోజులు.. 10 లక్షల సైబర్‌ దాడులు

ABN , Publish Date - May 03 , 2025 | 04:14 AM

పహల్గాం దాడి అనంతరం పాక్‌ హ్యాకర్లు భారత్‌పై లక్షల సంఖ్యలో సైబర్‌ దాడులకు పాల్పడ్డారు. కేంద్రం పాక్‌కు చెందిన యూట్యూబ్‌ చానళ్లను నిషేధిస్తూ కఠిన చర్యలు చేపట్టింది.

Pakistan Cyber Attacks: పది రోజులు.. 10 లక్షల సైబర్‌ దాడులు

పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్‌ హ్యాకర్లు

భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యా

రంగాల వెబ్‌ సర్వర్లలోకి చొరబడే యత్నాలు

పాకిస్థాన్‌తోపాటు బంగ్లాదేశ్‌, మొరాకో,

మధ్యప్రాచ్య దేశాల్లో తిష్ట వేసి దాడులు

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ యూట్యూబ్‌

చానల్‌పై భారత్‌లో నిషేధం

ముంబై, మే 2: పహల్గాం ఘటన తర్వాత పాకిస్థాన్‌ హ్యాకర్లు భారత్‌పై సైబర్‌ దాడులు ముమ్మరం చేశారు. గత పది రోజుల్లోనే ఏకంగా పది లక్షల సైబర్‌ దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర సైబర్‌ విభాగం తమ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. భారత్‌లోని వెబ్‌ సర్వర్లపై.. ముఖ్యంగా రక్షణ, టెలికం, రవాణా, విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టళ్లపై పాక్‌ హ్యాకర్లు దాడులకు దిగినట్టు తెలిపింది. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం, నిఘా పెట్టడంతోపాటు జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు పాక్‌ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. పాకిస్థాన్‌తోపాటు బంగ్లాదేశ్‌, మొరాకో, మధ్య ప్రాచ్యదేశాల్లో అడ్డా వేసి ఈ సైబర్‌ దాడులకు తెగబడుతున్నట్టు పేర్కొంది. కేంద్ర నిఘా సంస్థలు ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాయని, సైబర్‌ భద్రతను కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాయని తెలిపింది. మరోవైపు ‘సైబర్‌గ్రూప్‌ హోక్స్‌1337, నేషనల్‌ సైబర్‌ క్రూ’ పేరిట నగ్రోటా, సుంజువన్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లపై, విశ్రాంత సైనికుల హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ వెబ్‌సైట్లపై సైబర్‌ దాడులు జరిగాయి. జమ్మూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్‌ చేసి కీలకమైన సమాచారాన్ని తస్కరించినట్టు సమాచారం. కాగా, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీ్‌ఫకు చెందిన యూట్యూబ్‌ చానల్‌ను భారత్‌లో నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే పాక్‌ ప్రధాన టీవీ చానళ్లు, మీడియా సంస్థలకు చెందిన 16 యూట్యూబ్‌ చానళ్లనూ నిలిపివేసింది.


ఇవి కూడా చదవండి..

Supreme Court: పాక్ వెళ్లిపోవాలన్న ఆదేశాలపై యాక్సెంచర్ ఉద్యోగికి సుప్రీంకోర్టు ఊరట

Pehalgam Terror Attack: కరడుకట్టిన ఉగ్రవాదులు వీళ్లే..

Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు

Updated Date - May 03 , 2025 | 04:14 AM