Share News

Asaduddin Owaisi: భిన్న ధ్రువాలు ఒకే జట్టులో

ABN , Publish Date - May 25 , 2025 | 04:17 AM

పాక్ ఉగ్రవాదాన్ని అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు ఒవైసీ, నిశికాంత్ దూబేలతో కూడిన బహుళపక్ష ఎంపీలు బహ్రెయిన్ పర్యటన ప్రారంభించారు. విదేశాల్లో భారత్‌కు పెరుగుతున్న మద్దతును జర్మనీలో జైశంకర్‌ వెల్లడించారు.

Asaduddin Owaisi: భిన్న ధ్రువాలు ఒకే జట్టులో

సౌదీ వెళ్లిన ఎంపీల బృందంలో అసద్‌, దూబే

ఇది ప్రజాస్వామ్య విశిష్టత అన్న నిశికాంత్‌

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్‌ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్‌ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు బయలుదేరిన జట్టులో ఉండటం ఆసక్తిని రేపుతోంది. పాక్‌ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్‌, బహ్రెయిన్‌ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల బృందం శనివారం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఇందులో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబేలు ఉన్నారు. తాను, ఒవైసీ ఒకే విధానాన్ని అంతర్జాతీయంగా చెప్పడానికి ఉద్దేశించిన బృందంలో సహచరులు కావడం ప్రజాస్వామ్య విశిష్టత అని దూబే అన్నారు. కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగాలు కూడా ఈ బృందంలో ఉన్నారు. బహ్రెయిన్‌లో రెండు రోజుల పాటు సమావేశమైన అనంతరం వీరు కువైట్‌ వెళతారు. అక్కడి నుండి 27న రాత్రి సౌదీ అరేబియాకు, అక్కడి నుండి అల్జీరియాకు వెళతారు.


ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తనయ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం శనివారం రాత్రి ఖతర్‌ చేరుకుంది. ఈ బృందంలో తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయలతో పాటు విదేశీ మాజీ మంత్రులు మురళీధరన్‌, మనీశ్‌ తివారీ, తెలుగువారైన మాజీ దౌత్యవేత్త సయ్యద్‌ అక్బరుద్దీన్‌ ఉన్నారు. ఖతర్‌ అనంతరం ఈజిప్టు, ఇథియోపియా, దక్షిణాఫ్రికాలో ఈ బృందం పర్యటిస్తుంది. మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్‌నాథ్‌ షిండే తనయుడు శ్రీకాంత్‌ షిండే నేతృత్వంలోని బృందం యూఏఈ పర్యటనను ముగించుకుని శనివారం తిరిగి వెళ్లింది. ఇదిలా ఉండగా, ఉగ్రవాదం నుంచి తనను తాను కాపాడుకునే హక్కు భారతదేశానికి ఉందని జర్మనీ గుర్తించినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చెప్పారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన శనివారం బెర్లిన్‌లోని విదేశీ వ్యవహారాల జర్మన్‌ కౌన్సిల్‌లో ముఖాముఖిలో పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, అనంతరం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌, అంతర్జాతీయ సమాజం నుంచి ప్రత్యేకించి జర్మనీ నుంచి భారత్‌కు లభిస్తున్న బలమైన మద్దతును ఈ సందర్భంగా జైశంకర్‌ ప్రస్తావించారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:17 AM