Share News

Election Commission: చాలా రాష్ట్రాల్లో సగం మందికిపైగా ఓటర్లు ఎస్‌ఐఆర్‌కు పత్రాలు ఇవ్వనవసరం లేదు

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:21 AM

చాలా రాష్ట్రాల్లో సగం మందికిపైగా ఓటర్లు ఎస్‌ఐఆర్‌(సమగ్ర ఓటర్ల సవరణ)లో ఏ విధమైన పత్రాలూ సమర్పించాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఎన్నికల కమిషన్‌ అధికారులు...

Election Commission: చాలా రాష్ట్రాల్లో సగం మందికిపైగా ఓటర్లు ఎస్‌ఐఆర్‌కు పత్రాలు ఇవ్వనవసరం లేదు

  • వారంతా గత ఎస్‌ఐఆర్‌లోనే పత్రాలు సమర్పించారని వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: చాలా రాష్ట్రాల్లో సగం మందికిపైగా ఓటర్లు ఎస్‌ఐఆర్‌(సమగ్ర ఓటర్ల సవరణ)లో ఏ విధమైన పత్రాలూ సమర్పించాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఎన్నికల కమిషన్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. వారంతా ఆయా రాష్ట్రాల్లో గత ఎస్‌ఐఆర్‌లోనే ఓటర్లుగా నమోదవడమే దీనికి కారణమని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు 2002, 2004 సంవత్సరాల మధ్య ఎస్‌ఐఆర్‌ నిర్వహించాయని తెలిపారు. గత ఎస్‌ఐఆర్‌ నిర్వహించిన సంవత్సరాన్నే తదుపరి ఎస్‌ఐఆర్‌కు కటాఫ్‌ తేదీగా పరిగణిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మళ్లీ ఎప్పుడు ఎస్‌ఐఆర్‌ నిర్వహించాలో ఈసీ త్వరలో తేదీని నిర్ణయించనుంది. గత ఎస్‌ఐఆర్‌ తర్వాత ప్రచురించిన ఎన్నికల జాబితాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల(సీఈవోల)ను ఇప్పటికే ఈసీ ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల సీఈవోలు ఇప్పటికే ఆ జాబితాలను తమ వెబ్‌సైట్‌లలో ఉంచారు. ఢిల్లీలో చివరిసారిగా 2008 సంవత్సరంలో ఎస్‌ఐఆర్‌ నిర్వహించడంతో 2008 నాటి ఓటర్ల జాబితాను ఢిల్లీ సీఈవో వెబ్‌సైట్‌లో ఉంచారు. అలాగే, ఉత్తరాఖండ్‌ సీఈవో 2006 నాటి ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. కాగా, బిహార్‌లో 2003లో ఎస్‌ఐఆర్‌ నిర్వహించడంతో అప్పుడు ఓటర్లుగా నమోదైన 4.96 కోట్ల మంది(ప్రస్తుత ఓటర్లలో దాదాపు 60శాతం మంది) తాజా ఎస్‌ఐఆర్‌లో ఎలాంటి పత్రాలూ సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులకు ఈసీ సూచించింది. కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్ల కోసం అదనంగా మరో డిక్లరేషన్‌ ఫామ్‌ను పొందుపరిచారు. వీరంతా 1987 జూలై 1వ తేదీకి ముందు భారతదేశంలోనే పుట్టామని నిర్ధారించేందుకు ఏదైనా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, 1987 జూలై 1-2004 డిసెంబరు 2వ తేదీ మధ్య పుట్టిన దరఖాస్తుదారులు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీ, స్థలం నిర్థారించే పత్రాలను కూడా సమర్పించాలి.

Updated Date - Sep 18 , 2025 | 04:21 AM