Voter list update: కేరళలో 24 లక్షల ఓట్లు మాయం!
ABN , Publish Date - Dec 22 , 2025 | 04:32 AM
కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్-సర్) తర్వాత కేరళలో 24.08 లక్షల ఓట్లను తొలగించనున్నారు....
వీటిలో ఆరున్నర లక్షలు మృతులవే..రేపు ముసాయిదా జాబితా
తిరువనంతపురం, డిసెంబరు 21: కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్-సర్) తర్వాత కేరళలో 24.08 లక్షల ఓట్లను తొలగించనున్నారు. వీటిలో 6,49,885 ఓట్లు మరణించినవారివి. 6,45,548 మంది ఓటర్ల ఆచూకీ తెలియలేదు. అలాగే 8,16,221 మంది ఓటర్లు తమ చిరునామాల నుంచి శాశ్వతంగా వలసపోయారు. 1,36,029 మంది డూప్లికేట్ ఓటర్లు. రాష్ట్రంలోని మొత్తం 2.78 కోట్ల మంది ఓటర్లకూ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా.. 24,08,503 మంది నుంచి పూర్తిచేసిన ఫారాలు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రతన్ యు.కేల్కర్ వెల్లడించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమీక్షకు శనివారం ఆయన అఖిల పక్ష సమావేశం నిర్వహించి.. పై గణాంకాలను వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను మంగళవారం (23న) ప్రచురిస్తామని తెలిపారు. అభ్యంతరాలను అదే రోజు నుంచి స్వీకరించడం మొదలుపెట్టి జనవరి 22 వరకు కొనసాగిస్తామన్నారు. ఆ తర్వాత కొత్త ఓటర్ల నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తంచేశాయి. అసలైన ఓటర్లను తొలగించారని ఆరోపించాయి. అఖిలపక్ష భేటీకి సీపీఐ తరఫున హాజరైన ఆ పార్టీ నేత రాజాజీ మాథ్యూ థామస్ మాట్లాడుతూ.. ఎన్యుమరుషన్ ఫారాలను నింపి ఇచ్చినా తన ఓటును, తన భార్య ఓటును తొలగించారని ఆరోపించారు. ఈసీ అధికారులు తోసిపుచ్చారు. వారిద్దరి పేర్లు ఓల్లూరు నియోజకవర్గంలోని 43వ బూత్‌లో ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఇళ్లలోనే ఉండే పలువురు సీనియర్ సిటిజన్లను ఆచూకీ లేనివారి జాబితాలో చేర్చారని సీపీఎం సీనియర్ నేత ఎంవీ జయరాజన్ అన్నారు.