విదేశాలకు వెళ్లే ‘చదువు’ సొమ్ము తగ్గుతోంది!
ABN , Publish Date - May 29 , 2025 | 06:09 AM
విదేశాల్లో భారతీయ విద్యార్థుల చదువు కోసం ఇక్కడి నుంచి తరలిపోయే సొమ్ము (ఔట్‌వార్డ్ రెమిటెన్సెస్) ఏటేటా తగ్గుతోంది. రిజర్వుబ్యాంకు గణాంకాల ప్రకారం..
భారత విద్యార్థుల ఆలోచనా విధానంలో మార్పు
యూఎస్, కెనడాలకు బదులు కాస్త ఖర్చు తక్కువగా ఉండే దేశాలపై ఫోకస్
రిజర్వు బ్యాంకు గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ, మే 28: విదేశాల్లో భారతీయ విద్యార్థుల చదువు కోసం ఇక్కడి నుంచి తరలిపోయే సొమ్ము (ఔట్‌వార్డ్ రెమిటెన్సెస్) ఏటేటా తగ్గుతోంది. రిజర్వుబ్యాంకు గణాంకాల ప్రకారం.. 2022-23లో ఇలా తరలిన రెమిటెన్సులు రూ.44 వేలకోట్లు (5.16 బిలియన్ డాలర్లు) కాగా.. 2024-25లో సుమారు రూ.25 వేల కోట్లు (2.91 బిలియన్ డాలర్లు) మాత్రమే. విదేశాల్లో చదువు పట్ల భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అత్యంత ఎక్కువ ఖర్చయ్యే యూఎ్‌సఏ, కెనడా, యూకే వంటి దేశాల నుంచి.. తక్కువ వ్యయంతోనే నాణ్యమైన విద్య అందించే జర్మనీ, రష్యా వంటి దేశాలవైపు ఫోకస్ పెరుగుతోంది.
అదే సమయంలో మన విద్యార్థులు ఆయా దేశాల్లో తాత్కాలిక ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల ద్వారా ఖర్చులు వెళ్లదీసుకుంటుండటం.. అక్కడి వర్సిటీలు, విద్యాసంస్థల నుంచి స్కాలర్‌షి్‌పలు పొందడం.. విద్యాసంస్థల తోడ్పాటుతో ఆ దేశాల్లోనే రుణాలు పొందుతుండటం.. భారత్‌లో నాణ్యమైన విద్య అవకాశాలు పెరుగుతుండటంతో విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడం వంటివి కూడా మన దేశం నుంచి ‘ఔట్‌వార్డ్ రెమిటెన్సులు’ తగ్గడానికి కారణం. ఉదాహరణకు చూస్తే.. 2023లో కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు 2,33,532 అయితే.. 2024లో 1,37,608 మందికి తగ్గిపోయింది. ఇదే సమయంలో జర్మనీ, రష్యాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది.