Session Adjourned: బిహార్ ఓటర్ల జాబితాపై ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:58 AM
బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చించాలని డిమాండు చేస్తూ సోమవారం ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేశాయి....
చర్చలు లేకుండానే వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 18: బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చించాలని డిమాండు చేస్తూ సోమవారం ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేశాయి. దాంతో ఎటువంటి చర్చలు లేకుండానే సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వివిధ శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంకాగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం నడుమే ఆరు ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. సభ్యులు నినాదాలను కొనసాగిస్తుండడంతో ఈ శక్తిని ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమయినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సభ్యులు వెల్‌లోకి వచ్చి ఓట్ చోర్- గద్దీ చోడ్ అంటూ నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ స్థానంలో కూర్చొన్న బీజేపీ సభ్యురాలు సంధ్యా రాణి సభను వాయుదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తొలుత నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన 19 వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. బిహార్ ఓటర్ల జాబితాపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. బిహార్ ఓటర్ల జాబితాపై చర్చ జరగాలని డిమాండు చేశారు. సభాపతి అంగీకారం తెలపకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు.
లోక్‌సభలో జన విశ్వాస్ బిల్లు-2.0
కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2.0ను ప్రవేశపెట్టింది. చిన్నపాటి నేరాలకు సంబంధించిన 16కేంద్ర చట్టాల్లోని 288 నిబంధనలను ‘నేర’ పరిధి నుంచి తప్పించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇంతకుముందు కేంద్రం 2023లో ఇదేవిధంగా 19 మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధికి చెందిన 42 కేంద్ర చట్టాల్లోని 183 నిబంధనలు నేర రహితం చేస్తూ చట్టాన్ని రూపొందించింది. తాజాగా మరో జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు-2025ను కేంద్ర మంత్రి గోయల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత బిల్లును సెలక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపారు.