OpenAI CEO: త్వరలో ఏఐతో 40 శాతం ఉద్యోగాలు భర్తీ..!
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:59 AM
ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) 2030 నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి చేరుకుంటుందని ఓపెన్ ఏఐ సీఈవో...
ఓపెన్ ఏఐ సీఈవో ఆల్ట్‌మన్ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) 2030 నాటికి సూపర్ ఇంటెలిజెన్స్ స్థాయికి చేరుకుంటుందని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. త్వరలోనే ఏఐ 40 శాతం ఉద్యోగాలను భర్తీ చేయగలదని భావిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది యాక్సెల్ స్ర్పింగర్ అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్‌కే పరిమితమైన ఏఐ టెక్నాలజీ నేడు ప్రతి పనిలోనూ భాగమైందన్నారు. ఏఐ త్వరలోనే మానవ పరిధికి మించిన ఆవిష్కరణలు చేయగలదని చెప్పారు. ‘2030 నాటికి మనం చేయలేని పనులను చేసే అసాధారణ సాంకేతికత మన వద్ద ఉంటుందని నమ్ముతున్నాను’ అని ఆల్ట్‌మన్ వెల్లడించారు. టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందడం శుభపరిణామమే అయినప్పటికీ.. ఇది ఉద్యోగాల తొలగింపునకు దారితీయొచ్చని ఆయన పేర్కొన్నారు. కొన్నిరంగాల్లో పూర్తిగా కొత్త రకం పనులు పుట్టుకొస్తాయని, మరికొన్ని పనులు అదృశ్యమవుతాయని చెప్పారు. ఏది వచ్చినా దాన్ని స్వీకరించి నేర్చుకోవడం ముఖ్యమని అన్నారు.