Share News

Madras High Court: ఆ జడ్జి అభిశంసనకు అనుమతించొద్దు

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:54 AM

మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ను అభిశంసించాలంటూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు స్పీకర్‌కు నోటీసు ఇవ్వడాన్ని 36 మంది రిటైర్డు న్యాయమూర్తులు....

Madras High Court: ఆ జడ్జి అభిశంసనకు అనుమతించొద్దు

  • ప్రతిపక్ష ఎంపీల నోటీసు వ్యతిరేకించండి

  • మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తికి మద్దతుగా36 మంది రిటైర్డు జడ్జిల ఉమ్మడి ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబరు 20: మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ను అభిశంసించాలంటూ ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు స్పీకర్‌కు నోటీసు ఇవ్వడాన్ని 36 మంది రిటైర్డు న్యాయమూర్తులు ఒక ప్రకటనలో వ్యతిరేకించారు. ఈ నోటీసును స్వీకరించవద్దని స్పీకర్‌ను కోరారు. ప్రతిపక్ష ఎంపీల చర్యను అనుమతిస్తే, స్వతంత్ర న్యాయవ్యవస్థ మూలాలు కదిలిపోయే ప్రమాదం ఉన్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో తిరుపరన్‌ కుండ్రమ్‌లోని ఉచ్చి పిల్లయార్‌ మండపంలో దీపం వెలిగించేందుకు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ నిర్వాహకులను అనుమతిస్తూ ఈ నెల ఒకటో తేదీన మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. దీనివల్ల మండపానికి సమీపంలోని దర్గా లేక అక్కడి ముస్లిం సముదాయ హక్కులకు భంగం వాటిల్లబోదని ఆ బెంచ్‌కు నాయకత్వం వహించిన జస్టిస్‌ స్వామినాథన్‌ తెలిపారు. అధికార డీఎంకేకు చెందిన ఎంపీలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయమూర్తిని అభిశంసించాలంటూ ఈ నెల తొమ్మిదో తేదీన స్పీకర్‌ ఓం బిర్లాకు నోటీసు ఇచ్చారు. ఈ చర్యను తమ ఉమ్మడి ప్రకటనలో రిటైర్డు న్యాయమూర్తులు తప్పుబట్టారు. ‘‘సమాజంలోని ఓ నిర్దిష్ట వర్గ రాజకీయ, భావజాలపరమైన అభిప్రాయాలకు తలవొగ్గని న్యాయమూర్తులను బెదిరించడం సరికాదు. ఈ నోటీనును తిరస్కరించాల్సిందిగా అన్ని పార్టీల ఎంపీలను కోరుతున్నాం’’ అని ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Dec 21 , 2025 | 06:54 AM