Parliamentary CommitteeL: ఓబీసీల క్రీమీ లేయర్ పరిమితిని సవరించాలి
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:25 AM
ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీ క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని తక్షణమే సవరించాల్సిన అవసరం
పార్లమెంటరీ కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని తక్షణమే సవరించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత పరిమితి కారణంగా పెద్దసంఖ్యలో అర్హత కలిగిన ఓబీసీ అభ్యర్థులు రిజర్వేషన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోతున్నారని తెలిపింది. చివరిసారిగా 2017లో ఈ వార్షిక పరిమితిని రూ.6.5 లక్షల నుంచి రూ.8లక్షలకు సవరించినట్లు శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించిన 8వ నివేదికలో కమిటీ పేర్కొంది. సిబ్బంది, శిక్షణ శాఖ(డీవోపీటీ) నిబంధనల ప్రకారం.. ఈ ఆదాయ పరిమితిని అవరసమైతే ప్రతి మూడేళ్లకు ఒకసారి లేదా అంతకంటే ముందుగానే సమీక్షించాల్సి ఉంది. ‘‘ప్రస్తుత పరిమితి చాలా తక్కువగా ఉంది. ఓబీసీల్లోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఇది కవర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం రేటు, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని పెంచడం తక్షణ అవసరం’’ అని కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ గణేశ్ సింగ్ పునరుద్ఘాటించారు.