Nuclear arms race reawakens: మళ్లీ అణు సైరన్!
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:53 AM
మన ప్రపంచం మళ్లీ అణు భయంలోకి వెళుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అణ్వాయుధ పోటీ మొదలవుతోంది. ఒకప్పుడు అమెరికా...
ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి తరహాలో మళ్లీ అణ్వాయుధాల పోటీ
ఉక్రెయిన్ వేదికగా అగ్ర రాజ్యాల పోరు
అణుశక్తితో నడిచే క్షిపణి, టార్పెడోలను విజయవంతంగా పరీక్షించిన రష్యా
అణు పరీక్షలను పునః ప్రారంభిస్తున్నట్టు ట్రంప్ ప్రకటన.. అణ్వస్త్రాల పెంపులో చైనా
(సెంట్రల్ డెస్క్)
మన ప్రపంచం మళ్లీ ‘అణు’భయంలోకి వెళుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత తిరిగి అణ్వాయుధ పోటీ మొదలవుతోంది. ఒకప్పుడు అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధంతో ప్రపంచమంతా వణికిపోతే.. ఇప్పుడు ఉక్రెయిన్‌లో యుద్ధ పరిణామాలతో అమెరికా, రష్యా మధ్య ఉప్పూనిప్పుగా మారిన పరిస్థితి కలకలం రేపుతోంది. అణుశక్తితో నడుస్తూ, అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యమున్న అత్యాధునిక క్షిపణి, టార్పెడోలను విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల వెల్లడించగా.. తాము అణు పరీక్షలను పునః ప్రారంభిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అక్టోబరు 22న రష్యా అణ్వస్త్ర ప్రయోగానికి సంబంధించి డ్రిల్స్ కూడా నిర్వహించింది.
‘స్టార్‌వార్స్’ నుంచి నేటి ‘పొసైడాన్’ వరకు..
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా అగ్రరాజ్యంగా అవతరించింది. జపాన్‌పై చేసిన అణుదాడితో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అమెరికానే అనే అభిప్రాయం కలిగించింది. అమెరికాకు దీటుగా నిలిచేందుకు నాటి సోవియట్ యూనియన్ పెద్ద ఎత్తున అణ్వాయుధాలు, క్షిపణులను తయారు చేసింది. ఈ క్రమంలో సోవియట్ యూనియన్ నుంచి రక్షణ కోసమని 1983లో నాటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ‘స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ (ఎస్‌డీఐ)’ను ప్రకటించారు. భూమితోపాటు అంతరిక్షంలోనూ రాడార్లు, క్షిపణులు, లేజర్ ఆయుధాలను మోహరిస్తామని ప్రకటించారు. ఈ ఎస్‌డీఐనే ‘స్టార్‌వార్స్’గా కూడా పిలుస్తారు. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవడంతో అమెరికా దూకుడు తగ్గించుకుంది. కానీ సోవియట్‌లో భాగమైన రష్యా పోటీగా నిలవడంతో మళ్లీ ఆయుధాల రేసు మొదలైంది. ఈ క్రమంలో 10 వేల కిలోమీటర్లకుపైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి మినట్ మ్యాన్-3, జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల ట్రైడెంట్-2 డీ5 బాలిస్టిక్ క్షిపణుల (7,300 కి.మీ. పరిధి)ను, బీ-2 వంటి అత్యాధునిక, స్టెల్త్, భారీ బాంబర్లను అమెరికా అభివృద్ధి చేసింది.
మరోవైపు రష్యా కూడా 18వేల కిలోమీటర్ల పరిధి ఉన్న ఆర్‌ఎస్-28 సర్మత్ వంటి క్షిపణులను, క్షిపణుల నుంచి విడివడి గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో లక్ష్యంపై దాడి చేయగల అవన్‌గార్డ్ వంటి గ్లైడ్ ఆయుధాలను అభివృద్ధి చేసింది. తాజాగా అణుశక్తితో నడిచే, అణ్వాయుధ సామర్థ్యమున్న బురెవె్‌స్టనిక్ క్రూయిజ్ క్షిపణి, పొసైడాన్ టార్పెడోలను విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. బురెవె్‌స్టనిక్ క్షిపణి అణుశక్తితో దూసుకెళ్తుంది కాబట్టి.. దానికి గరిష్ఠ పరిమితి ఏమీ లేదని, ప్రయోగ సమయంలో 15 గంటల్లో 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని రష్యా తెలిపింది. ఇక జలాంతర్గామి నుంచి ప్రయోగించే పొసైడాన్ టార్పెడో కూడా సముద్రంలో అడుగున ప్రయాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి విధ్వంసం సృష్టింగలదని చెబుతున్నారు.
‘అణు’తెరపై చైనా దూకుడు
ప్రపంచంలో ఆర్థిక పరంగా రెండో అతిపెద్ద దేశంగా ఎదిగిన చైనా కూడా అగ్రరాజ్యం అనిపించుకోవడానికి ‘అణు’మార్గం పట్టింది. కొన్నేళ్లుగా అణ్వస్త్రాల తయారీ వేగాన్ని పెంచింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నివేదిక ప్రకారం.. 2020లో చైనా వద్ద 300 అణ్వస్త్రాలు ఉండగా, ప్రస్తుతం 600కు చేరాయి. 2030 నాటికి ఈ సంఖ్య 1000 దాటుతుందని అంచనా. కానీ చైనా భారీ స్థాయిలో అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోందని.. వచ్చే ఐదారేళ్లలో అమెరికా, రష్యాలతో సమానంగా చైనా వద్ద అణ్వస్త్రాలు ఉంటాయని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
అణు పరీక్షలకు సిద్ధమవుతున్న పాక్?
పాకిస్థాన్ తమ సింధ్ ప్రాంతంలోని పర్వత ప్రాంతాల్లో రహస్యంగా సొరంగాల నిర్మాణం చేపట్టింది. అది అణు పరీక్షల కోసమేనని సింధు ప్రాంతంలోని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితికి, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ)లకు తాజాగా ఫిర్యాదు చేశాయి. పాకిస్థాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందని ఇటీవల ట్రంప్ పేర్కొనడం గమనార్హం.
ప్రపంచంపై ఆధిపత్యం కోసం..
ప్రపంచంలో తొలిసారిగా అమెరికా అణ్వాయుధాల తయారీ కోసం 1942లో మాన్‌హట్టన్ ప్రాజెక్టును చేపట్టింది. 1945లో జూలైలో ట్రినిటీ పేరిట తొలి అణు పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టులో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై వేసిన అణు బాంబులు ప్రపంచ గతినే మార్చేశాయి. అగ్ర రాజ్యాల మధ్య అణ్వాయుధ పోటీ మొదలైంది. 1949 ఆగస్టులో సోవియట్ యూనియన్ ‘ఫస్ట్ లైట్నింగ్’ పేరిట తొలి అణుపరీక్ష నిర్వహించింది. ప్రపంచం రెండు ధ్రువాలుగా మారిపోయింది. ఈ క్రమంలో 1962లో ప్రపంచం ఒకసారి అణుయుద్ధం అంచుల వరకు వెళ్లింది. అమెరికాకు సమీపంలో ఉన్న కమ్యూనిస్టు దేశం క్యూబాలో సోవియట్ యూనియన్ క్షిపణులు మోహరించిన విషయం తెలిసి అమెరికా అగ్గిమీద గుగ్గిలమైంది. ఇరుదేశాల యుద్ధ నౌకలు, విమానాల మోహరింపుతో అణు యుద్ధం మొదలైనట్టేనన్న పరిస్థితి నెలకొంది. కానీ ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో అమెరికా, సోవియట్ వెనక్కి తగ్గాయి. 1963లో కొత్త అణుపరీక్షల నిషేధంపై మధ్యంతర ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ అణ్వాయుధాల తయారీ కొనసాగింది. కొత్తగా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయకుండా 1972లో సాల్ట్-1 (వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం) చేసుకున్నాయి. తర్వాత 1979లో సాల్ట్-2 ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ అణ్వాయుధాల సంఖ్యను, ఒకే సమయంలో ఎక్కువ సంఖ్యలో లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల (ఎంఐఆర్‌వీ) సంఖ్యను తగ్గించుకోవడానికి అంగీకరించాయి. కొన్నేళ్లు అంతా బాగానే ఉన్నా.. అఫ్ఘానిస్థాన్‌ను సోవియట్ ఆక్రమించుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
క్షిపణులు, సబ్‌మెరైన్ల సామర్థ్యం ఎంత?
రష్యా..
అణ్వస్త్రాలను ప్రయోగించగల ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణులు రష్యా వద్ద 1,950 వరకు ఉన్నట్టు అంచనా. అందులో నేల మీది నుంచి ప్రయోగించే.. ఆర్‌ఎస్-28 సర్మత్-18,000 కి.మీ, ఆర్-36ఎం - 16,000 కి.మీ, ఆర్‌ఎస్-24 యార్స్ - 12,000 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ఆర్-29 ఆర్‌ఎంయూ2 సినేవా - 11,500 కి.మీ, ఆర్‌ఎస్ ఎం-56 బులవా - 9,000 కి.మీ. సామర్థ్యం ఉన్నవి. ఇవన్నీ ఇప్పటికే వినియోగంలో ఉన్నవి. ఇటీవల పరీక్షలు చేసిన అణుచోదిత క్షిపణి, అణుచోదిత పొసైడాన్ టార్పెడోలు వీటికి అదనం. ఇక రష్యా వద్ద మొత్తం 79 జలాంతర్గాములు ఉన్నాయి. అందులో 16 అణుశక్తితో నడిచేవి. నీటి అడుగునే ఉండి ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం వాటి సొంతం.
యూఎ్‌సఏ
అమెరికా వద్ద అణ్వస్త్రాలను ప్రయోగించగల ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణులు 1,200 వరకు ఉన్నట్టు అంచనా. అందులో నేలమీద నుంచి ప్రయోగించే.. మినట్‌మ్యాన్-3, సెంటినల్ క్షిపణుల పరిధి 13 వేల కి.మీ వరకు ఉంటే.. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ట్రైడెంట్-2డీ5 పరిధి 12 వేల కి.మీ. ఇక అమెరికా వద్ద మొత్తం 68 జలాంతర్గాములు ఉన్నాయి. అందులో 14 అణుశక్తితో నడిచేవి. నీటి అడుగునే ఉండి ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం వాటి సొంతం. యూఎస్ వద్ద ఉన్నవాటిలో ఒహియో, కొలంబియా క్లాస్ సబ్‌మైరెన్లు ముఖ్యమైనవి.