Pakistan WhatsApp Groups: 36 పాక్ వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:21 AM
ధర్మవరం వాసి కొత్వాల్ నూర్ మహమ్మద్‌కు ఉన్న ఉగ్రలింకులను కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు ,,
ధర్మవరం వాసి ఉగ్ర లింకులపై ఫోకస్
నూర్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్
పుట్టపర్తి/ధర్మవరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ధర్మవరం వాసి కొత్వాల్ నూర్ మహమ్మద్‌కు ఉన్న ఉగ్రలింకులను కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. పాకిస్థాన్‌కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రూపులు ఏంటి? వాటిలో కార్యకలాపాలు ఏంటి? ఏమి సమాచారాన్ని ఆ గ్రూపుల్లో పంచుకున్నాడనేది విశ్లేషిస్తున్నారు. దీని కోసం అతని మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ సహా ఆరు ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నట్లు ఇప్పటికే తేలింది. మరో 30 పాక్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నాడని తాజాగా వెల్లడైంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నూర్ మహమ్మద్‌ను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. కడప సెంట్రల్ జైల్‌లో ఉన్న అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఽధర్మవరం కోర్టులో పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, నూర్ మహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్ర లింకులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ ఉన్నట్లు తేలింది. ఆ రాష్ట్రాలకు చెందిన ఇద్దరితో సంబంధాలు నెరిపినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు ఆ రాష్ట్రాలకు వెళ్లినట్లు తెలిసింది.