Amit Shah: నక్సలైట్లపై కాల్పులు విరమించం
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:09 AM
కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు చేసిన ప్రతిపాదనను అంగీకరించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు...
వారి ప్రతిపాదనను అంగీకరించేది లేదు: అమిత్ షా
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు చేసిన ప్రతిపాదనను అంగీకరించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఒకవేళ వారు లొంగిపోయి, ఆయుధాలను అప్పగిస్తామంటే మాత్రం స్వాగతిస్తామని తెలిపారు. అలాంటప్పుడు భద్రతా బలగాలు వారిపై ఒక్క తూటాను కూడా పేల్చవని తెలిపారు. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని దాదాపు పక్షం రోజుల క్రితం నక్సలైట్లు చేసిన ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నక్సల్ ముక్త్ భారత్‌పై ఆదివారం ఇక్కడ జరిగిన సదస్సు మగింపు కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ ‘‘ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఇటీవల నక్సలైట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతవరకు జరిగిందంతా పొరపాటని అందులో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ప్రకటించాలని, తామంతా లొంగిపోతామని చెప్పారు. నేనేమి చెబుతున్నానంటే కాల్పుల విరమణ ఉండబోదు. ఒక వేళ వారు లొంగిపోతే కాల్పుల అవసరమే రాదు. ఆయుధాలు అప్పగిస్తే ఒక్క తూటాను కూడా పేల్చం’’ అని విస్పష్టంగా చెప్పారు. నక్సలైట్లు లొంగిపోతే వారికి ఎర్ర తివాచీ పరుస్తామని, ఆకర్షణీయమైన పునరావాస పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు. నక్సలైట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. 2026 మార్చి 31నాటికి దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని పునరుద్ఘాటించారు.