Supreme Court: రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు సరి కాదు
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:41 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించే అధికారం...
ఆర్టికల్ 200 ప్రకారం నిర్ణయం తీసుకునే సౌలభ్యం వారికే కల్పించాలి
50 ఏళ్లలో 90 శాతం బిల్లులకు నెలరోజుల్లోనే గవర్నర్ల ఆమోదం
సుప్రీంలో కేంద్ర ప్రభుత్వ వాదనలు.. తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అనే అంశంపై అన్ని పక్షాల వాదనలూ విన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును గురువారం వాయిదా వేసింది. ఈ అంశంపై న్యాయసలహా కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు అడిగిన (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సంగతి తెలిసిందే. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌ల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 19న విచారణ చేపట్టింది. దశలవారీగా 10రోజులపాటు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలను విన్నది. అటార్నీ జనరల్ వెంకట రమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ తా కేంద్రం తరఫున గురువారం తుదివాదనలు వినిపించారు. రాష్ట్ర మంత్రివర్గం పంపిన బిల్లులపై నిర్ణ యం తీసుకోకుండా నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం సరైనది కాకపోవచ్చునని.. అయితే నిర్దిష్ట కాలంలో బిల్లులను ఆమోదించాలంటూ కాలపరిమి తి మాత్రం విధించకూడదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 200ప్రకారం నిర్ణయం తీసుకునే సౌలభ్యాన్ని గవర్నర్‌కు కల్పించాలని తెలిపారు. గత యాభై ఏళ్లలో 90ు బిల్లులను గవర్నర్లు కేవలం నెలరోజుల్లోపే ఆమోదించారని మరోసారి గుర్తు చేశారు.