Share News

Indian Parliament: ఉపరాష్ట్రపతికి రెగ్యులర్‌ వేతనం లేదు

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:04 AM

భారత ఉపరాష్ట్రపతికి వేతన సదుపాయం లేదు. అయితే రాజ్యసభ చైర్మన్‌గా మాత్రం ఆయనకు నెలకు రూ.4 లక్షల జీతం లభిస్తుంది. దీనితో పాటు ఉచిత వసతి, వైద్య సదుపాయం....

Indian Parliament: ఉపరాష్ట్రపతికి రెగ్యులర్‌ వేతనం లేదు

  • రాజ్యసభ చైర్మన్‌గా నెలకు రూ.4 లక్షలు

  • రిటైరయ్యాక నెలకు 2 లక్షల పెన్షన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: భారత ఉపరాష్ట్రపతికి వేతన సదుపాయం లేదు. అయితే రాజ్యసభ చైర్మన్‌గా మాత్రం ఆయనకు నెలకు రూ.4 లక్షల జీతం లభిస్తుంది. దీనితో పాటు ఉచిత వసతి, వైద్య సదుపాయం.. రైళ్లు, విమానాల్లో ప్రయాణం, సిబ్బంది, వ్యక్తిగత భద్రత, మొబైల్‌ ఫోన్‌, ల్యాండ్‌ఫోన్‌ మొదలైన ప్రయోజనాలు అందుతాయి. పార్లమెంటు అధికారుల వేతనాలు, భత్యాల చట్టం (1953) ప్రకారం ఉపరాష్ట్రపతికి నిర్దిష్ట వేతనం ఇవ్వాలన్న నిబంధనేదీ లేదని.. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో మాత్రం జీతం, ఇతర ప్రోత్సాహకాలు లభిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. పదవీవిరమణ తర్వాత నెలకు సుమారు రూ.2 లక్షలు పెన్షన్‌ వస్తుంది. రాజధాని ఢిల్లీలో టైప్‌-8 బంగళా, వ్యక్తిగత కార్యదర్శి, అదనపు వ్యక్తిగత కార్యదర్శి, వ్యక్తిగత సహాయకుడు, వైద్యుడు, నర్సింగ్‌ అధికారి, నలుగురు వ్యక్తిగత పరిచారకులు ఉంటారు. మాజీ ఉపరాష్ట్రపతి మరణిస్తే అతడి/ఆమె భార్య/భర్తకు జీవితాంతం టైప్‌-7 నివాసం ఇస్తారు. పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ జూలై 21న ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధన్‌ఖడ్‌ గతంలో 1993-98 మధ్య రాజస్థాన్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 జూలై వరకు మాజీ శాసనసభ్యుడిగా పెన్షన్‌ అందుకున్నారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులు కావడంతో పెన్షన్‌ నిలిచిపోయింది. 2019-22 నడుమ గవర్నర్‌గా మూడేళ్లు పనిచేసిన ఆయన.. 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాజీనామా తర్వాత మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 04:06 AM