FSSAI Clarifies: గుడ్లతో ఎలాంటి ప్రమాదం లేదు
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:39 AM
భారత్‌లో లభ్యమయ్యే గుడ్లలో క్యాన్సర్ ముప్పు కారకాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) కొట్టిపారేసింది.
క్యాన్సర్ ముప్పు కారకాలేవీ లేవు: ఎఫ్‌ఎస్ఎస్ఏఐ
న్యూఢిల్లీ, డిసెంబరు 20: భారత్‌లో లభ్యమయ్యే గుడ్లలో క్యాన్సర్ ముప్పు కారకాలున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) కొట్టిపారేసింది. భారత్‌లో విక్రయిస్తున్న గుడ్లలో క్యాన్సర్ ముప్పునకు కారణమయ్యే నైట్రోఫ్యురాన్ మెటబాలైట్స్ ఉంటున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ చట్టం-2011 ప్రకారం దేశంలోని పౌల్ట్రీలు, గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యురాన్స్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. బాహ్య గరిష్ఠ అవశేష పరిమితి (ఈఎంఆర్‌ఎల్)కి లోబడి కనీస స్థాయిలో నైట్రోఫ్యురాన్ మెటబాలైట్స్ ఉండడం సాధారణ విషయమేనని పేర్కొంది. అది చట్టాన్ని ఉల్లంఘించడం కాదని, దాంతో ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ స్పష్టం చేసింది.