NDA Victory in Bihar: బిహార్ మళ్లీ ఎన్డీయేదే!
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:31 AM
బిహార్ అధికార పీఠం మళ్లీ ఎన్డీయేదేనని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మహాగఠ్‌బంధన్ ఎంజీబీపై భారీ మెజారిటీతో అధికార కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి....
నితీశ్-మోదీ జోడీకే ప్రజల పట్టం
130కి పైగా సీట్లు ఖాయం
వెల్లడించిన 9 ఎగ్జిట్‌పోల్స్
ప్రతిపక్ష కూటమికి గరిష్ఠంగా 108!
పీకే ప్రభావం శూన్యమేనని అంచనాలు
న్యూఢిల్లీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): బిహార్ అధికార పీఠం మళ్లీ ఎన్డీయేదేనని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మహాగఠ్‌బంధన్ (ఎంజీబీ)పై భారీ మెజారిటీతో అధికార కూటమి విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ప్రశాంత్ కిశోర్ పార్టీకి తీవ్ర నిరాశే మిగులుతుందని తేల్చాయి. బిహార్‌లో బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని 9 సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టం చేశాయి. నితీశ్, మోదీ.. ‘నిమో’ ఫార్ములా ఎన్డీయేకు అనుకూలించిందని సర్వేలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్రంలో ఈ నెల 6, 11న రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఎంజీబీ కూటములు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ప్రస్తుత సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్‌కు ఇవే చివరి ఎన్నికలని భావిస్తున్నారు. ఆయన 19 ఏళ్లకుపైగా బిహార్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇక లాలూ ప్రసాద్ ఆర్జేడీ బాధ్యతలను తన కుమారుడు తేజస్వి యాదవ్‌కు అప్పగించారు. ఆయన్ను ఎంజీబీ సీఎం అభ్యర్థిగా నిర్ణయించారు. ఎన్డీయే, ఎంజీబీ నేతలతో పాటు ప్రశాంత్ కిశోర్ జనసురాజ్ పార్టీ(జేఎస్పీ) తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. బిహార్‌లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేశాయి.
అధికార ఎన్డీయేకు బిహారీలు మరోసారి పట్టం కట్టనున్నట్లు దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. అధికారం చేపట్టడానికి 122 సీట్లు అవసరం కాగా.. ఎన్డీయేకు 130కి పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. ఎంజీబీకి గరిష్ఠంగా 108 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జేఎస్పీ ప్రభావం దాదాపు శూన్యమేనని పేర్కొన్నాయి. ఆ పార్టీకి సీట్లు కష్టమేనని తేల్చాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఎన్డీయే కూటమికి 130కి పైగా సీట్లు వస్తాయని తెలిపాయి. నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.25 కోట్ల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డీయే విజయానికి దోహదపడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈబీసీ వర్గాల మద్దతుతో ఎన్డీయే ఆధిక్యంలో ఉండగా.. ముస్లింలు, బౌద్ధులు, బీసీ సామాజిక వర్గాల్లో అధిక శాతం ఎంజీబీ వైపు నిలిచారని విశ్లేషిస్తున్నారు. రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ నినాదం బిహార్‌లో ఓట్లను రాబట్టలేకపోయిందని పేర్కొంటున్నారు. నిరుద్యోగం, వలసలు వంటి అంశాలను ఎంజీబీ ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా యువత ఆదరించలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ సారి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 66.91ు పోలింగ్ నమోదైంది. ఈ నెల 6న జరిగిన తొలి విడతలో 121 సీట్లకు, మంగళవారం మలి విడతలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రెండు విడతల్లో కలిపి 66.91ు పోలింగ్ నమోదైందని ఈసీ తెలిపింది.