NDA Dominates in Bihar: డబుల్ ఇంజన్.. డబుల్ సెంచరీ..
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:41 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు దుమ్మురేపింది. మోదీ, నితీశ్ కుమార్ జోడీ అద్బుతం చేసింది. ఎన్నికల్లో ఆరింట ఐదొంతుల సీట్లను సాధించి విజయ దుందుభి మోగించింది! రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలుంటే ఎన్డీయే 202 సీట్లలో ఘన విజయం సాధించింది.....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు!
బిహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు!
బిహార్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది!
కార్పెట్ బాంబింగ్ చేసినా.. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు!
అసెంబ్లీ, లోక్‌సభ.. ఎన్నిక ఏదైనా ఓటమికి చిరునామాగా రాహుల్ నిలుస్తున్నారు!
ఒకప్పుడు అజేయమనుకున్న బీఆర్‌ఎస్‌ది కూడా ఇప్పుడు అచ్చంగా అదే బాట!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ తీరు తీసికట్టే!
బిహార్‌లో ఎన్డీయే ప్రభంజనం’
మొత్తం 243 సీట్లకుగాను 202 చోట్ల గెలుపు
89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. జేడీయూకు 85
మోదీ మ్యాజిక్.. ఫలించిన నితీశ్ అభివృద్ధి మంత్రం
నితీశ్‌కు మహిళలు, బీసీల మంగళ హారతులు
కూటమి విజయంలో చిరాగ్ పాసవాన్ కీలక పాత్ర
ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లోనూ బీజేపీ గెలుపు
మహాగఠ్ బంధన్‌కు మహా గట్టి దెబ్బ.. 35 సీట్లకే పరిమితం
బిహారీలను ఇంకా వీడని ‘జంగిల్ రాజ్’ భయం
6 సీట్లకే కాంగ్రెస్ పరిమితం.. మజ్లిస్ ఖాతాలో 5 సీట్లు
సీఎంగా మరోసారి నితీశ్‌కుమారే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు దుమ్మురేపింది. మోదీ, నితీశ్ కుమార్ జోడీ అద్బుతం చేసింది. ఎన్నికల్లో ఆరింట ఐదొంతుల సీట్లను సాధించి విజయ దుందుభి మోగించింది! రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలుంటే ఎన్డీయే 202 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ ఏకంగా 88 శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది! ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి ఏకంగా 89 స్థానాల్లో విజయం సాధిస్తే.. పవన్ కల్యాణ్ తరహాలోనే బిహార్లో చిరాగ్ పాసవాన్ ఫీనిక్స్ పక్షిలా ఎదిగి.. 68ు స్ట్రైక్ రేట్‌ను సాధించారు! గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన ఆయన.. ఈసారి 28 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో తన పార్టీని గెలిపించారు. ఇక, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా 101 సీట్లలో పోటీ చేసి 85 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, సుశాసన్‌బాబుగా నితీశ్‌కుమార్‌కు ఉన్న పేరు, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి అనే నినాదాలు కూటమికి ఘన విజయం కట్టబెట్టాయి. బిహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి తుడిచిపెట్టుకుపోయింది! గత అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు సాధించిన ఆ కూటమి ఈసారి అందులో మూడోవంతు(35)కే పరిమితమైంది! శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు.. మోదీ, జగన్, మమత, స్టాలిన్ తదితరులను గెలిపించానని చెప్పుకొన్న ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు సొంత రాష్ట్రం బిహార్లో పని చేయలేదు! జన సురాజ్ పేరిట పార్టీ పెట్టి.. పాదయాత్ర చేసి.. ఎన్నికల బరిలోకి దిగిన ఆయనను బిహారీలు ఏమాత్రం పట్టించుకోలేదు! ఆయన పార్టీ అభ్యర్థులు సోదిలో కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం! వెరసి, అసెంబ్లీ ఎన్నికల్లో బిహారీలు ఎన్డీయేకు పట్టం కట్టారు.
తేజస్వి ఇచ్చిన అలవిమాలిన హామీల కంటే నితీశ్ కుమార్ సుపరిపాలనకే ఓటేశారు. నిజానికి, కాంగ్రెస్, ఆర్జేడీ నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ కూటమి ప్రధానంగా ‘ముస్లిం-యాదవ్’ ఓటు బ్యాంకును నమ్ముకుంది. వారి మద్దతుతో ఎన్నికలను గట్టెక్కవచ్చని భావించింది. కానీ, ముస్లిం, బీసీల ఓట్లు చీలిపోవడం ఆ పార్టీకి అశనిపాతమైంది. అదే సమయంలో, ఎన్డీయే మాత్రం మహిళలు, అత్యంత వెనకబడిన వర్గాలను ఆకర్షించింది. మహిళలకు ప్రత్యేకంగా పథకాలను అమలు చేయడమే కాదు.. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పేరిట దాదాపు 1.4 కోట్ల మందికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేసింది. అంతేనా.. ఐదేళ్లుగా మద్యపాన నిషేధాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారు. దాంతో, పోలింగ్ రోజు ఓటు వేయడానికి మహిళలు పోటెత్తారు. పురుషుల కంటే దాదాపు పది శాతం అదనంగా ఓటేశారు. ఎన్డీయే కూటమి విజయంలో ఇది కీలకంగా చెప్పవచ్చు. అలాగే, అత్యంత వెనుకబడిన వర్గాలు (ఈబీసీ), ఇతర వెనకబడిన వర్గాలు (ఓబీసీ) కూడా నితీశ్‌కే జైకొట్టారు. ఒకప్పుడు జంగిల్ రాజ్‌గా పిలిచే బిహార్‌కు రోడ్లు, పరిశ్రమలు తదితర మౌలిక సదుపాయాలు తీసుకొచ్చారు. ఇక, అగ్ర వర్ణాలను బీజేపీ ఆకర్షిస్తే.. దళితులను చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఆకర్షించింది. ఇలా కూటమిలోని వివిధ పార్టీలు దళితులు, అగ్ర వర్ణాలు, బీసీలు, మహిళలు తదితరులను ఆకర్షించడం ద్వారా ఎన్డీయే విజయ బావుటా ఎగరేసింది. ఎన్డీయే ఇప్పటికే హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఘన విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు బిహార్లో గెలిచి బెంగాల్ దిశగా పయనిస్తోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడం వెనక చిరాగ్ పాసవాన్ కూడా కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచిన ఆయన పార్టీ ఈసారి ఏకంగా 28 స్థానాల్లో పోటీ చేసి 19 సీట్లలో విజయం సాధించింది. దళితులను ఎన్డీయే వైపు ఆకర్షించడంలో క్రియాశీల పాత్ర పోషించింది. ఎన్డీయే కూటమిలోని హెచ్‌ఏఎంఎ్‌స 5, ఆర్‌ఎల్‌ఎం 4 సాధించాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ఎజెండాగా ప్రజలకు సంబంధించిన అంశాన్ని ఎత్తుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఓటు చోరీ పేరిట హడావుడి చేసింది. ఓట్ అధికార యాత్ర పేరిట రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారమూ చేశారు. రిజర్వేషన్లకు 50ు పరిమితిని ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.
కానీ, ఆ పార్టీని ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ (6)కే పరిమితం కావడం గమనార్హం. ‘సర్’ ప్రభావిత నియోజకవర్గాల్లోనూ ఎన్డీయేనే విజయం సాధించడం ఇక్కడ విశేషం. ఇక, తేజస్వి అధికారంలోకి వస్తే మళ్లీ జంగిల్ రాజ్ వస్తుందని ప్రజలు భయపడ్డారు. ఆ భయం ఓట్ల రూపంలో సుస్పష్టంగా కనిపించింది. 34 సీట్లకే పరిమితమైన మహా గఠ్ బంధన్ కూటమిలో జేడీయూ 25, కాంగ్రెస్ 6, సీపీఐఎంఎల్ 2, సీపీఐ 1 స్థానంలో మాత్రమే గెలిచాయి. ఇక ఏ కూటమిలోనూ లేని ఎంఐఎం 5 సీట్లు, బీఎస్పీ, ఐఐపీ ఒక్కో సీటు సాధించాయి. ఇక, బిహార్ ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా చెప్పుకొన్న ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్ మొత్తం 243 స్థానాల్లోనూ బరిలోకి దిగింది. కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గెలవడం మాట అటుంచితే.. ఎన్నికల్లో ఆ పార్టీ అసలు ప్రభావమే చూపించలేకపోయింది. ‘మాకు వస్తే పది లోపు సీట్లు వస్తాయి. లేకపోతే 150 పైన వస్తాయి’ అని ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ముందు చెప్పారు. కానీ, అరంగేట్రంతోనే ప్రజలు డకౌట్ చేసి పంపించారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లను గెలిచిన మజ్లిస్.. ఈ ఎన్నికల్లోనూ వాటిని నిలబెట్టుకుంది. ఏ కూటమిలోనూ చేరకుండా విడిగా 29 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం.. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సీమాంచల్‌లో ప్రభావం చూపింది.

ఓటర్లకు కృతజ్ఞతలు బిహార్ సీఎం నితీశ్ కుమార్
బిహార్ ఓటర్లకు, ప్రధాని మోదీకి, ఎన్డీయే నాయకులకు సీఎం నితీశ్ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం అనంతరం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు అఖండ మెజార్టీని అందించి మా ప్రభుత్వంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఓటర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రధాని మోదీ మద్దతుకు ధన్యవాదాలు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పూర్తి స్థాయిలో ఐక్యతను ప్రదర్శించి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్డీయే కూటమిలోని భాగస్వాములైన చిరాగ్ పాసవాన్, జితన్‌రామ్ మాంజీ, ఉపేంద్ర కుష్వాహాలకు కృతజ్ఞతలు. మీ అందరి సహకారంతో బిహార్ మరింత అభివృద్ధి చెందబోతోంది’ అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.