Nitish Kumar takes oath: నితీశ్ దశావతారం
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:32 AM
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నితీశ్‌తో సీఎంగా, బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలతో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించారు...
బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్
పట్నా, నవంబరు 20: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నా గాంధీ మైదానంలో గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నితీశ్‌తో సీఎంగా, బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలతో డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన మొత్తం 14మంది, జేడియూకు చెందిన 8 మంది, ఎల్‌జేపీ నుంచి ఇద్దరు, హిందూస్థాన్ అవామ్ మోర్చా, ఆర్‌ఎల్‌ఎం నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు. వాస్తవానికి ఆర్‌ఎల్‌ఎం తరపున ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ భార్య స్నేహలత మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యేగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కాని దీపక్ ప్రకాశ్ (ఉపేంద్ర కుష్వాహ కుమారుడు) మంత్రిగా ప్రమాణం చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భారీ జనసందోహం సాక్షిగా సాగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ప్రధాని మోదీ వేదికపై నుంచి తన కండువాను ఊపుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. బిహార్‌లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎంగా నితీశ్ మొత్తం 19 ఏళ్లు అధికారంలో కొనసాగారు. మరోవైపు కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వానికి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అభినందనలు తెలిపారు. కాగా, బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని గాంధీ ఆశ్రమంలో ఒకరోజు మౌనవ్రతం చేపట్టారు.
స్వర్ణ పతక విజేత శ్రేయసికి మంత్రి పదవి
2018 కామన్‌వెల్త్ గేమ్స్ షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణపతకం సాధించిన ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ బిహార్ మంత్రిగా ప్రమాణం చేశారు. జముయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తన ప్రత్యర్థి ఆర్జేడీ నేత షంషాద్ ఆలమ్‌ను ఆమె 54వేల ఓట్ల తేడాతో ఓడించారు. 2020లో బీజేపీలో చేరిన శ్రేయసి నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత విజయ్ ప్రకాశ్‌పై గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ గెలిచి యువ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.