Nitish Kumar Set to Return as Bihar CM: నితీశే సీఎం?
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:32 AM
బిహార్‌లో బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినా.. అధికారంలో కొనసాగడానికి గతంలోలాగా జేడీయూ అవసరం అంతగా లేకపోయినా..
మరోసారి ఆయనకే పగ్గాలు ఖాయమంటున్న ఎన్డీయే వర్గాలు
కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు జేడీయూ ఎంపీలే కీలకం
న్యూఢిల్లీ, నవంబరు 14: బిహార్‌లో బీజేపీకి జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినా.. అధికారంలో కొనసాగడానికి గతంలోలాగా జేడీయూ అవసరం అంతగా లేకపోయినా.. ఈసారి కూడా నీతీశే సీఎం అయ్యే అవకాశం ఉందని, ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోదీ హాజరవుతారని ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్, ఎల్జేపీ ఎంపీ శాంభవి చౌదరి, హిందుస్థానీ అవామ్ మోర్చా నేత జితన్ రామ్ మాంఝీ వంటివారు నీతీశే సీఎం అవుతారని, అందులో సందేహం లేదని తేల్చిచెబుతున్నారు. మహిళలు, దళితులు, అత్యంత వెనుకబడిన వర్గాల్లో (ఈబీసీలు) నీతీశ్‌కున్న పట్టు.. ప్రస్తుత ఘన విజయంలో ఆయా వర్గాల పాత్ర నేపథ్యంలో.. బీజేపీ ఆయన్ను కాదని మరొకరిని సీఎంగా చేయలేదని ఎన్డీయే వర్గాలు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటికీ మించి.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ ఎంపీలు అత్యంత కీలకం. బీజేపీ, టీడీపీ తర్వాత అత్యధికంగా ఎంపీలు ఉన్నది ఆ పార్టీకే. ఆ కోణంలో కూడా బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో నీతీశ్‌కు సీఎం పీఠం అప్పజెప్పక తప్పదని రాజకీయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే.. ఐదేళ్లూ నీతీశ్ ఆ పదవిలో ఉండకపోవచ్చని.. బీజేపీకి వరుసగా రెండు ఎన్నికల్లో జేడీయూ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చిన నేపథ్యంలో ఒకటి-రెండేళ్లు మాత్రమే ఆయన్ను సీఎంగా ఉండనిచ్చి, తర్వాత తమ పార్టీ నేతను సీఎంగా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. నీతీశ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని.. జేడీయూలోనే కొందరు నేతలు ఆయన ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైనంత ఫిట్‌గా లేరని భావిస్తున్నట్టు సమాచారం. దీన్ని సాకుగా చూపి బీజేపీ తమ పార్టీకి చెందిన నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషిస్తున్నారు.
నితీశ్ సీఎం అయితే.. పదోసారి!
గిట్టనివాళ్ల దృష్టిలో నీతీశ్ కుమార్.. పదే పదే జట్టును మార్చే ‘పల్టూ రామ్’! దశాబ్దాల తరబడి సాగిన ఆటవిక పాలనలో మగ్గిన బిహార్ ప్రజలకు మాత్రం.. ఆయన అభివృద్ధి రుచి చూపిన ‘సుశాసన్ బాబు!! అందుకే ఆయన ఎన్నిసార్లు రాజకీయ పిల్లిమొగ్గలు వేసినా.. ఒకసారి బీజేపీతో, మరొకసారి ఆర్జేడీతో.. మళ్లీ అంతలోనే బీజేపీతో కలిసి రాజకీయం చేసినా.. బిహార్ ప్రజల దృష్టిలో మాత్రం ఆయన పరపతి ఏ మాత్రం తగ్గలేదు. 2000 సంవత్సరంలో తొలిసారి సీఎం పదవిని చేపట్టి.. అందులో కేవలం వారం రోజులే(2000 మార్చి 3 నుంచి మార్చి 10 దాకా) ఉన్న నీతీశ్.. సభలో తన పార్టీకి తగిన మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు. 2005లో మరోసారి సీఎం అయ్యి ఐదేళ్లూ పాలించారు. 2010 నవంబరు నుంచి 2014 మే దాకా మూడోసారి సీఎంగా వ్యవహరించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూకి కేవలం 2 సీట్లే రావడంతో సీఎం పదవికి రాజీనామా చేసి జితన్ రామ్ మాంఝీని ముఖ్యమంత్రిని చేశారు. మళ్లీ 2015 ఫిబ్రవరిలో ఆయన్ను తప్పించి తానే సీఎం అయ్యారు. ఆ ఏడాదిలో బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జనతా పరివార్ అలయన్స్ గ్రూప్ తరఫున సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టారు. 2017 దాకా ఆ కూటమి తరఫునే సీఎంగా ఉన్న నీతీశ్.. 2017 జూలై నుంచి 2020 నవంబరు దాకా బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా ఉన్నారు. మళ్లీ 2020లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఆ ఏడాది నవంబరులో ఏడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2022లో ఎన్డీయే కూటమిని వదిలి మహాగడ్బంధన్‌తో జట్టుకట్టి.. ఆ ఏడాది ఆగస్టులో ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ 2024 జనవరిలో ఎన్డీయేతో చేతులు కలిపి మరోసారి సీఎం అయ్యారు. అలా ఇప్పటికి తొమ్మిదిసార్లు ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడితే.. పదోసారి ఆ పదవిని చేపట్టినట్టు అవుతుంది. నీతీశ్ విషయంలో మరో రికార్డు ఏంటంటే.. ఇప్పటికి దాదాపు 20 ఏళ్లపాటు బిహార్‌కు సీఎంగా వ్యవహరించిన ఆయన ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైంది రెండుసార్లే. 1985లో ఒకసారి.. 1995లో మరోసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. కానీ తొలిసారి సీఎం అయింది 2000లో. అప్పట్నుంచీ ఇప్పటిదాకా.. తొమ్మిదిసార్లూ ఆయన విధాన పరిషత్తు (శాసనమండలి) సభ్యుడుగానే సీఎం పదవి చేపట్టారు.