NIA Uncovers Drone Based Rocket: రాకెట్ దాడులకు కుట్ర
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:26 AM
ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర ముఠా దేశంలో కొత్త తరహా దాడులకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఢిల్లీలోని...
డ్రోన్లను పరీక్షించిన ఫరీదాబాద్ మాడ్యూల్
అది విఫలమవటంతో కారు బాంబు దాడి
న్యూఢిల్లీ, నవంబరు 18: ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్ర ముఠా దేశంలో కొత్త తరహా దాడులకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహ్మద్ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అనుచరుడు జాసిర్ బిలాల్ వని అలియాస్ డాని్‌షను అరెస్టు చేసి విచారించగా కుట్రలో కొత్తకోణం వెల్లడైంది. ఈ ఉగ్ర వైద్యుల ముఠా ఢిల్లీ, మరికొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా రాకెట్ దాడులకు ప్రణాళిక వేసినట్లు జాసిర్ వెల్లడించాడు. గాజాలోని హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై చేసే దాడులతో వీరు స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు. ఢిల్లీలోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో రాకెట్ దాడులు చేసి మారణహోమం సృష్టించేందుకు వీరు కుట్ర చేసినట్లు వివరించాడు. అందుకోసం రాకెట్లు తయారుచేసి డ్రోన్లకు అమర్చి పేల్చే ప్రయోగాలు కూడా చేశారని, కానీ అవి విఫలమయ్యాయని వెల్లడించాడు. దీంతో కారు బాంబు దాడులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
దాడికి ముందే వీడియో రికార్డు
ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ.. ఆ దాడికి ముందే అల్ ఫలాహ్ యూనివర్సిటీలోని తన గదిలో రికార్డు చేసిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ నబీ మాట్లాడాడు. ‘ఆత్మాహుతి దాడులను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ, అది సరైన పనే. ఆత్మాహుతి దాడి అమరత్వం పొందేందుకు చేసే ఆపరేషన్’ అని ఆ వీడియోలో నబీ పేర్కొన్నాడు. ఇతడు జాసిర్ బిలాల్‌ను కూడా ఆత్మాహుతి దాడికి ఒప్పించినట్లు దర్యాప్తులో తేలింది. కాగా, అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో కశ్మీరీ ఫ్యాకల్టీ అంతా కలిసి ఉగ్రవాద భావజాలాన్ని ఒక పద్ధతి ప్రకారం వ్యాపింపజేసినట్లు పోలీసులు వైద్యురాలు షహీన్ విచారణలో వెల్లడించింది. కాలేజీలో 70ు ఫ్యాకల్టీ కశ్మీర్‌కు చెందినవారేనని, వీరంతా గ్రూప్‌గా ఏర్పడి ఇతర ఫ్యాకల్టీపై ఆధిపత్యం చెలాయించేవారని తేలింది.
అల్ ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడి అరెస్ట్
అల్ ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అతడిపై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం అల్ ఫలాహ్ వర్సిటీతోపాటు జావేద్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 9 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు.