Newspapers: వార్తా పత్రికలకు ఆదరణ పెరిగింది
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:44 AM
దేశంలో వార్తా దిన పత్రికలకు ఆదరణ పెరిగిందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్ ఏబీసీ ఓ ప్రకటనలో తెలిపింది...
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్ వెల్లడి
గత ఏడాదితో పోలిస్తే 2.77ు పెరిగిన అమ్మకాలు
ముంబై, సెప్టెంబరు 11: దేశంలో వార్తా దిన పత్రికలకు ఆదరణ పెరిగిందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్(ఏబీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నిర్వహించిన ఆడిటింగ్ వివరాల గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వార్తా దినపత్రికల అమ్మకాల్లో ఆరోగ్యకరమైన పురోగతి కనపడిందని తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 29, 744, 148 కోట్ల కాపీల అమ్మకాలు జరిగాయని వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి 28, 941, 876 కోట్ల కాపీల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోల్చితే మొత్తం 2.77ు అధికమని, 802, 272 కాపీలు అధికంగా అమ్ముడయ్యాయని ఏబీసీ తెలిపింది. ఈ పురోగతి వార్తా దినపత్రికలపై పాఠకులకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని అభిప్రాయపడింది. అంతేకాదు విశ్వసనీయ, ధ్రువీకరించిన, లోతైన సమాచారం కోసం పాఠకులు వార్తా దినపత్రికలను చదువుతున్నారని ఏబీసీ వెల్లడించింది. దినపత్రికలు శక్తిమంతమైన మాధ్యమంగా మారాయనడానికి సర్కులేషన్ పెరుగుదల నిదర్శనంగా నిలుస్తోందని ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్ తెలిపింది.