Share News

SC Students Scholarship Renewal: మార్కుల ఆధారంగా రెన్యువల్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:10 AM

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ 2024-25 విద్యా సంవత్సరానికి షెడ్యూల్‌ కులాల విద్యార్థులకు అత్యున్నత స్థాయి ఉపకార వేతన పథకానికి సంబంధించిన తాజా...

SC Students Scholarship Renewal: మార్కుల ఆధారంగా రెన్యువల్‌

  • ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నూతన మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ 2024-25 విద్యా సంవత్సరానికి షెడ్యూల్‌ కులాల విద్యార్థులకు అత్యున్నత స్థాయి ఉపకార వేతన పథకానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిబంధనలను ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని విస్తృతం చేయడంతో పాటు విద్యాసంస్థల బాధ్యతను మరింత బలపరిచేలా రూపొందించారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో చేరే షెడ్యూల్‌ కులాల విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి విద్య అందించేలా దీనికి రూపకల్పన చేశారు. ఈ పథకం కింద విద్యార్థుల పూర్తి ట్యూషన్‌ ఫీజు, తిరిగి చెల్లించని ఇతర రుసుములను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తారు. పైవేట్‌ విద్యాసంస్థల విద్యార్థులకు ఈ మొత్తాన్ని సంవత్సరానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పరిమితం చేశారు. అదనంగా, నివాసం, పుస్తకాలు, ల్యాప్‌టా్‌పలు వంటి అవసరాల కోసం మొదటి సంవత్సరంలో రూ.80 వేలు, తర్వాత ప్రతి సంవత్సరం రూ.41 వేలు చొప్పున అందజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షి్‌పలను పొందుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి.. ఐఐటీ, ఐఐఎమ్‌, ఎయిమ్స్‌, ఎన్‌ఐటీ, నేషనల్‌ లా యూనివర్సిటీలు, ఎన్‌ఐఎ్‌ఫటీ, ఎన్‌ఐడీ, ఐహెచ్‌ఎమ్‌ వంటి గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రవేశం సాధించిన ఎస్సీ విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కోర్సు పూర్తయ్యే వరకు ఏటా వారి మార్కుల ఆధారంగా రెన్యువల్‌ చేస్తారు. అయితే, ఇప్పటికే ఈ పథకంలో లబ్ధి పొందుతున్న విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు సహాయం పొందుతారు.

Updated Date - Nov 27 , 2025 | 04:10 AM