NEET Topper Takes Own Life: నీట్‌లో 1475వ ర్యాంకు..కాలేజీలో చేరాల్సిన రోజే యువకుడి ఆత్మహత్య!
ABN , Publish Date - Sep 25 , 2025 | 03:54 AM
తమ బిడ్డడు ఇక వైద్యవిద్యలో చేరనున్నాడనే సంబురం ఆ తల్లిదండ్రుల్లో క్షణాల్లోనే మాయమై తీరని విషాదం మిగిలింది. ఎంబీబీఎస్ చదివేందుకు కాలేజీలో ప్రవేశం...
ఎంబీబీఎస్ ఇష్టం లేదని సూసైడ్ నోట్.. మహారాష్ట్రలో ఘటన
ముంబై, సెప్టెంబరు 24: తమ బిడ్డడు ఇక వైద్యవిద్యలో చేరనున్నాడనే సంబురం ఆ తల్లిదండ్రుల్లో క్షణాల్లోనే మాయమై తీరని విషాదం మిగిలింది. ఎంబీబీఎస్ చదివేందుకు కాలేజీలో ప్రవేశం పొందాల్సిన రోజే ఆ అబ్బాయి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని చంద్రార్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతుడు 19 ఏళ్ల అనురాగ్ అనిల్ బోర్కర్. నవార్‌గావ్ గ్రామానికి చెందిన అనురాగ్, నీట్ (అండర్ గ్యాడ్యుయేట్)లో 99.99 పర్సంటైల్ సాధించాడు. జాతీయ స్థాయిలో 1475వ ర్యాంకు వచ్చింది. కౌన్సెలింగ్‌లో యూపీలోని గోరఖ్‌పూర్ కాలేజీలో సీటొచ్చింది. అక్కడికి వెళ్లేందుకు లగేజీతో సిద్ధమైన అనురాగ్, ఇంట్లోనే ఓ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలిలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో అనురాగ్ ఏం రాశాడన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే.. తనకు వైద్య విద్య చదవడం గానీ, డాక్టర్ అవ్వడం గానీ ఇష్టం లేదని ఆ నోట్‌లో అనురాగ్ రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.