Lives Deprived of Sunlight: ఎండ తగలని జీవితాలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:28 AM
పట్టణాల్లో ప్రజల జీవితాలు ఎండ కన్నే సోకనివి అయిపోయాయి. ఉదయం ఆఫీసుకు వెళ్లడం మొదలు.. రాత్రి ఇంటికి చేరుకోవడం వరకు ఎక్కడా సూర్యకిరణాలు...
దేశంలోని 46.5 శాతం మందిలో విటమిన్-డి లోపం
పట్టణ ప్రజల్లోనే అత్యధిక బాధితులు
మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ అధ్యయనం
న్యూఢిల్లీ, అక్టోబరు 30: పట్టణాల్లో ప్రజల జీవితాలు ఎండ కన్నే సోకనివి అయిపోయాయి. ఉదయం ఆఫీసుకు వెళ్లడం మొదలు.. రాత్రి ఇంటికి చేరుకోవడం వరకు ఎక్కడా సూర్యకిరణాలు శరీరానికి తగలడంలేదు. దీంతో మన శరీరంలో స్వతహాగా విటమిన్-డి ఉత్పత్తి జరగడంలేదు. మన దేశంలో కౌమార వయసు వారు మొదలు.. ఉద్యోగాలు చేసే వారి వరకు వివిధ వయసుల ప్రజల్లో విటమిన్-డి లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ సంస్థ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనం ద్వారా అది వెల్లడైంది. దేశంలో 46.5 శాతం మంది ప్రజల్లో విటమిన్-డి లోపం ఉందని 2019-25 మధ్య చేసిన 22 లక్షల ల్యాబ్ పరీక్షలను విశ్లేషించి ఆ సంస్థ చెప్పింది. అలాగే 26 శాతం మందిలో ఆ విటమిన్ చాలినంత స్థాయిలో కూడా లేదని పేర్కొంది. పట్టణాల్లో నివసించే ప్రజల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోందని వెల్లడించింది.