Tamil Nadu voters list: తమిళనాడులో 97,00,000 ఓట్ల తొలగింపు!
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:28 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓట్లర్ల పేర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు....
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 5.43 కోట్లు
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
గుజరాత్‌లో 73 లక్షల ఓట్ల తొలగింపు: ఈసీ
న్యూఢిల్లీ, డిసెంబరు 19: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తమిళనాడులో 97,37,832 మంది ఓట్లర్ల పేర్లను తొలగించినట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు. తమిళనాడు ఓటర్ల ముసాయిదా జాబితాను ఆమె శుక్రవారం విడుదల చేశారు. తొలగింపుల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5,43,76,755కు చేరిందని చెప్పారు. వీరిలో పురుషులు 2.66 కోట్ల మంది కాగా, మహిళా ఓటర్లు 2.77 కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య దాదాపు 6.41 కోట్లు అని చెప్పారు. తాజాగా తొలగించిన వారిలో 26.94 లక్షల మంది మృతి చెందగా, 66.44 లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వేరే చోటుకు మారడం లేదా వలస వెళ్లారని, మరో 3,39,278 మంది పేర్లు ఒకటి కంటే ఎక్కువచోట్ల నమోదయ్యాయని (డూప్లికేట్) అర్చన వెల్లడించారు. కాగా, గుజరాత్‌లో ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా ఈసీ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్రంలో సర్ ప్రక్రియ అనంతరం వేర్వేరు కారణాలతో 73.73 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లను తొలగించినట్లు పేర్కొంది. మరోవైపు, కేరళ, ఉత్తరప్రదేశ్(యూపీ) రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ గడువును పొడిగించాలన్న డిమాండ్లను సానుభూతితో పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) సుప్రీంకోర్టు సూచించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 31లోగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ‘‘పిటిషనర్లకు గడువు కోరే స్వేచ్ఛ ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల అభ్యర్థనను సానుభూతితో పరిశీలించండి’’ అని ధర్మాసనం సూచించింది. ఈసీ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేదీ స్పందిస్తూ.. ‘సర్’ నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోని పరిస్థితులను ఈసీ పరిశీలిస్తోందని, అవసరమైన చోట ఇప్పటికే గడువును పొడిగించిందని తెలిపారు.