Share News

Bihar Assembly Election Battle Heats Up: బిహార్‌లో సీటు పోరు!

ABN , Publish Date - Oct 08 , 2025 | 03:44 AM

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్‌ వెలువడిన మరుసటి రోజు నుంచే సీట్ల పంపకాల రాజకీయం మొదలైంది...

Bihar Assembly Election Battle Heats Up: బిహార్‌లో సీటు పోరు!

  • కూటముల్లో పెద్దన్న పాత్ర కోసం పార్టీల పట్టు.. సీట్ల పంపకంపై విస్తృతంగా చర్చలు

పట్నా/న్యూఢిల్లీ, అక్టోబరు 7: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్‌ వెలువడిన మరుసటి రోజు నుంచే సీట్ల పంపకాల రాజకీయం మొదలైంది. పెద్దన్న పాత్ర కోసం కూటముల్లోని పార్టీల్లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎన్డీయే కూటమిలో ప్రధానమైన బీజేపీ, జేడీయూ సమాన సంఖ్యలో సీట్లలో పోటీచేయాలనే భావనకు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు మహాఘట్‌బంధన్‌ కూటమిలో సీట్ల లెక్కతోపాటు సీఎం అభ్యర్థి అంశమూ సందిగ్ధత రేపుతోంది. ఇక చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ తాజాగా ఎన్డీయే కూటమిని వీడి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ జన సురాజ్‌ పార్టీతో జట్టుకట్టవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బిహార్‌ ఎన్నికలు మూడు కూటముల ముక్కోణపోటీగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ, జేడీయూ.. సమానంగా సీట్లు!

బిహార్‌లో ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీయూతోపాటు లోక్‌జనశక్తి (ఎల్‌జేపీ), హిందుస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం), రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎం) భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో బీజేపీ, జేడీయూతోపాటు చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ కూడా కీలకం. ప్రతిసారి కూటమిలో భాగంగా బీజేపీ కంటే జేడీయూ ఎక్కు వ స్థానాల్లో పోటీ చేస్తూ వస్తోంది. అయితే ఈసారి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు కేటాయించే సీట్లు పోగా.. మిగతా సీట్లలో ఇరు పార్టీలు సమానంగా పోటీచేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఎల్‌జేపీకి 25, హెచ్‌ఏఎంకు ఏడు, ఆర్‌ఎల్‌ఎంకు ఆరు సీట్లు ఇస్తామని బీజేపీ, జేడీయూ ప్రతిపాదించినట్టు సమాచారం. ఎల్‌జేపీ ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతోందని, అదే జరిగితే హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎంల సీట్లకు కోతపడవచ్చని.. వాటికి రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఆఫర్‌ చేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఎన్డీయే కూటమి మళ్లీ గెలిస్తే ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని చర్చ కూడా జరుగుతోంది. నితీశ్‌కుమార్‌ కాకుండా బీజేపీ నేత సీఎం అయ్యే అవకాశాలూ ఉన్నాయని, అందులో భాగంగానే బీజేపీ, జేడీయూ సమానంగా సీట్లలో పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చాయని కమలం వర్గాలు పేర్కొంటున్నాయి.


మహాఘట్‌బంధన్‌లో సీఎం గిరీకి పోటీ!

విపక్ష మహాఘట్‌బంధన్‌ కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంతోపాటు సీట్ల పంపకాల విషయంలోనూ భేదాభిప్రాయాలు పొడసూపుతున్నాయి. కూటమి తరఫున తేజస్వియాదవ్‌ సీఎం అభ్యర్థి అని ఆర్జేడీ ధీమాగా ఉండగా, కాంగ్రెస్‌ ఇంకా దీనికి బహిరంగంగా అంగీకారమేదీ తెలపకపోవడంతో సందిగ్ధత నెలకొంది. దీనికితోడు మంగళవారం బిహార్‌ కాంగ్రెస్‌ నేత ఉదిత్‌రాజ్‌ చేసిన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ‘‘తేజస్వి యాదవ్‌ ఆర్జేడీ వాళ్లకు సీఎం అభ్యర్థి కావొచ్చు. కానీ కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది అంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌కు దీటుగా నిలబడేది తేజస్వియాదవ్‌ మాత్రమేనని ఆర్జేడీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ బహిరంగంగా ఆ పార్టీ తరఫున ఎవరూ దీనిపై స్పందించలేదు.

ప్రశాంత్‌ కిషోర్‌తో చిరాగ్‌ పాశ్వాన్‌ జట్టు?

జన సురాజ్‌ పార్టీతో తెరపైకి వచ్చిన ప్రశాంత్‌కిషోర్‌తో చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జేపీ జట్టు కట్టవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న ఎల్‌జేపీ ఈసారి ఎక్కువ సీట్ల కోసం డిమాండ్‌ చేస్తోంది. 25 సీట్లు ఇస్తామని బీజేపీ ప్రతిపాదించగా.. 40కిపైనే ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ప్రతినియోజకవర్గంలో 20,25 వేల ఓట్లను తాము ప్రభావితం చేయగలమని.. తాము బయటికి వెళ్తే కూటమికి ఇబ్బందులు తప్పవని చిరాగ్‌ పాశ్వాన్‌ ఇప్పటికే స్పష్టంచేశారని ఎల్‌జేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సీట్ల లెక్కపై సయోధ్య కుదరలేదని.. ఎన్డీయే నుంచి ఎల్‌జేపీ బయటికి రావొచ్చని అంటున్నాయి. అదే జరిగితే ప్రశాంత్‌ కిషోర్‌తో చిరాగ్‌ జట్టుకట్టి కూటమిగా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

రాజకీయాల్లోకి మైథిలీ ఠాకూర్‌!

అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శబరిపై పాటపాడి, ప్రధాని మోదీ ప్రశంసలు పొందిన జానపద గాయని మైథిలీ ఠాకూర్‌ను బీజేపీ బిహార్‌ ఎన్నికల బరిలోకి దింపనుంది. ఇటీవల ఆమె బిహార్‌ బీజేపీ ఇన్‌చార్జి వినోద్‌ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌లతో సమావేశమయ్యారు కూడా. దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా.. ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయమేదీ రాలేదన్నారు. తన స్వస్థలం బిహార్‌లోని మధుబని జిల్లా బేణిపట్టికి వెళుతున్నానని.. ప్రజలను కలిసి, మాట్లాడాలని చెప్పారు.

1.jpg

Updated Date - Oct 08 , 2025 | 03:44 AM