Partition: దేశ విభజన దోషులు వీళ్లే!
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:52 AM
ఎన్సీఈఆర్టీ మరోసారి వార్తల్లో నిలిచింది. దేశ విజభనపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల కోసం తాజాగా ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. ‘విభజన భయానకాల స్మారక దినం’ను పురస్కరించుకొని విడుదల చేసిన దానిలో..
జిన్నా డిమాండ్‌కు కాంగ్రెస్ ఓకే.. మౌంట్ బాటన్ అమలు
విభజన వల్లే కశ్మీర్ సమస్య.. ప్రత్యేక మాడ్యూల్లో ఎన్సీఈఆర్టీ
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఎన్సీఈఆర్టీ మరోసారి వార్తల్లో నిలిచింది. దేశ విజభనపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల కోసం తాజాగా ఒక ప్రత్యేక మాడ్యూల్‌ను విడుదల చేసింది. ‘విభజన భయానకాల స్మారక దినం’ను పురస్కరించుకొని విడుదల చేసిన దానిలో.. భారతదేశ విభజనకు మహ్మద్ అలీ జిన్నా ఒక్కరే కారణం కాదని, ఆయన డిమాండ్‌ను ఆమోదించిన కాంగ్రెస్, అమలు చేసిన అప్పటి వైస్రాయి లార్డ్ మౌంట్‌బాటన్‌లు కూడా అని పేర్కొంది. ‘విభజన దోషులు’ అనే సెక్షన్‌లో ఈ ప్రస్తావన చేసింది. విభజన తర్వాత భారత్‌కు కశ్మీర్ ఒక కొత్త సమస్యగా మారిందని, దేశ విదేశాంగ విధానానికి సవాల్ సృష్టించిందని పేర్కొంది. ఎన్సీఈఆర్టీ మాడ్యూల్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరును కూడా ప్రస్తావించింది. భారత్‌లో అంతర్యుద్ధం కంటే దేశాన్ని విభజించడం మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు పేర్కొంది.
మహాత్మా గాంధీ వైఖరి గురించి చెప్తూ.. విభజనను ఆయన వ్యతిరేకించారని, కానీ హింస ద్వారా కాంగ్రెస్ నిర్ణయాన్ని ఆపలేనని గాంధీ చెప్పినట్లు మాడ్యూల్‌లో పేర్కొన్నారు. దేశ విభజనపై 6-8 తరగతులు (మిడిల్ స్టేజ్), 9-12 తరగతుల (సెకండరీ స్టేజ్) విద్యార్థుల కోసం రెండు వేర్వేరు మాడ్యూల్స్‌ను ప్రచురించింది. ఈ మాడ్యూళ్లపై రాజకీయ దుమారం రేగింది. పుస్తకంలో పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తిప్పికొట్టారు. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ మధ్య సహకారం వల్లే భారత్, పాక్ విభజన జరిగిందని, ఇదీ వాస్తవమని అన్నారు. ‘చరిత్రలో అతిపెద్ద విలన్ అంటే అది ఆరెస్సెస్. ఆ సమయంలో 25 ఏళ్ల గూఢచర్యం పాత్ర పోషించిన ఆ సంస్థను భవిష్యత్తు తరాలు క్షమించవు. ఆ గూఢచర్యంలో ముస్లింలు, జిన్నాతో భాగస్వామ్యం ఉంది’ అని ఆరోపించారు. ‘ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించకపోతే.. ఆ పుస్తకాన్ని తగలబెట్టండి’ అని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా మాట్లాడుతూ తనకు అనుకూలంగా లేనప్పుడు చరిత్ర నుంచి కాంగ్రెస్ పారిపోతుందన్నారు.