Naugaw Police Station Blast: శాంపిల్ తీస్తుండగా పేలుడు
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:31 AM
జమ్ముకశ్మీర్‌లోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న పేలుడులో మృతుల సంఖ్య 9కి పెరిగింది.
నౌగావ్ పోలీ స్ స్టేషన్ పేలుడులో 9 మంది మృతి.. మృతుల్లో పోలీసులు, ఒక నాయబ్ తహసీల్దార్
ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు ఇక్కడ నిల్వ
శ్రీనగర్, నవంబరు 15: జమ్ముకశ్మీర్‌లోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న పేలుడులో మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఇటీవల బయటపడిన ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌పై దర్యాప్తు జరుపుతున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇస్రార్ అహ్మద్‌షా, ఒక నాయబ్ తహసీల్దార్ (మేజిస్ట్రేట్)తో కలిపి మొత్తం 9 మంది మరణించారని, 32 మంది గాయపడ్డారని జమ్ముకశ్మీర్ డీజీపీ నళినిప్రభాత్ శనివారం తెలిపారు. బాధితుల్లో అధికంగా పోలీస్, ఫోరెన్సిక్ అధికారులే ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం లేదని కేంద్రం ప్రకటించింది. ఘటనపై జమ్ముకశ్మీర్ ఎల్జీ దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగింది? ఇటీవల హరియాణాలోని ఫరీదాబాద్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించిన జమ్ముకశ్మీర్ పోలీసులు.. అక్కడి అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ముగ్గురు వైద్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకడైన ముజమ్మిల్ గది నుంచి స్వాధీనం చేసుకున్న 360 కిలోల పేలుడు పదార్థాలను నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో భద్రపర్చారు. దర్యాప్తులో భాగంగా గురువారం నుంచి ఆ పేలుడు పదార్థాల నుంచి వివిధ రకాల శాంపిల్స్ సేకరిస్తున్నారు. నాయబ్ తహసీల్దార్ ముజాఫిర్ అహ్మద్ ఖాన్ సమక్షంలో రాష్ట్ర దర్యాప్తు ఏజెన్సీ ఇన్‌స్పెక్టర్ ఇస్రార్ అహ్మద్ షా నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.20 గంటల సమయంలో శాంపిల్ సేకరిస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయిందని డీజీపీ నళిని ప్రభాత్ తెలిపారు. ‘నిబంధనల ప్రకారం ఫోరెన్సిక్, కెమికల్ ఎగ్జామినేషన్ కోసం రెండు రోజులుగా శాంపిల్స్ సేకరిస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా ఫోరెన్సిక్ లేబోరోటరీ సిబ్బంది ఆ పనిలో ఉండగా దురదృష్టవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ ఘటన విషయంలో ఇతర ఏ రకమైన ప్రచారాలను నమ్మొద్దు’ అని సూచించారు. మొదటి పేలుడు సంభవించిన వెంటనే పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
అయితే, ఆ వెంటనే పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన మరికొన్ని పేలుడు పదార్థాలు కూడా పేలిపోవటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. పోలీసులకు సహాయం చేయటానికి వచ్చిన ఒక టైలర్ కూడా ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయాడు. దర్యాప్తునకు ఆదేశం: ఎల్జీ నౌగావ్ పోలీస్ స్టేషన్ పేలుడుపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం ప్రకటించారు. పేలుడులో పోలీస్, ఇతర అధికారులను కోల్పోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఏమీ లేదని కేంద్ర హోంశాఖ జాయింట్ సెకట్రరీ ప్రశాంత్ లోఖండే తెలిపారు. ఈ పేలుడు ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారనేది ఈ ఘటన గుర్తుచేస్తోందని శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పేలుడు కేంద్ర ప్రభుత్వానికి మేల్కొలుపు లాంటిదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. నౌగావ్ పేలుడపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తంచేశారు.