Tahawwur Rana: నేడు భారత్‌కు రాణా
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:35 AM
2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొస్తున్నారు. ఎన్‌ఐఏ బృందం ప్రత్యేక విమానంలో అతడిని తరలిస్తుండగా, ఢిల్లీలో కస్టడీకి తీసుకోనుంది.

ఎట్టకేలకు ముంబై పేలుళ్ల
సూత్రధారిని అప్పగించిన అమెరికా
జైలు నుంచి ఎన్‌ఐఏ కస్టడీలోకి
ప్రత్యేక విమానంలో బయల్దేరిన బృందం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ముంబై పేలుళ్ల సూత్రధారి తహవ్వుర్ రాణాను అమెరికా జైలు నుంచి భారత్‌కు తీసుకొస్తున్నారు. నేరస్థుల అప్పగింత ఒప్పందం కింద కస్టడీలోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) బృందం అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్‌కు బయలుదేరింది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటుంది. పాకిస్థాన్‌కు చెందిన రాణా కెనడా పౌరుడు. పాకిస్థాన్ ఆర్మీలో డాక్టర్‌గా పనిచేసిన అతడు 1997లో కెనడాకు వలస వెళ్లాడు. అనంతరం అమెరికాకు వెళ్లి ఇమిగ్రేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్‌లోని ఆ సంస్థ కార్యాలయంలోనే లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఆశ్రయం పొంది ముంబై పేలుళ్లకు కీలక భవనాల వద్ద రెక్కీ నిర్వహించినట్టు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 2008 నవంబరు 26న ముంబైపై జరిపిన ఉగ్రదాడిలో 174 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 300 మందికిపైగా గాయాలపాలయ్యారు. రాణాను తమకు అప్పగించాలంటూ భారత్ ఎప్పటి నుంచో అమెరికాను కోరుతోంది. భారత జైళ్లలో తనను చిత్ర హింసలకు గురిచేస్తారని, అది హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి విరుద్ధమంటూ రాణా పలు ఫెడరల్ కోర్టులతోపాటు అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, అన్ని చోట్లా అతడికి చుక్కెదురైంది. అతడికి అన్ని అవకాశాలూ మూసుకుపోవడంతో అమెరికా వెళ్లిన ఎన్‌ఐఏ బృందం రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో భారత్‌కు బయలుదేరింది. ఎన్‌ఐఏ, ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో అతడు విచారణను ఎదుర్కోనున్నాడు.