Share News

Bullet Train on Track: దూసుకొస్తున్న బుల్లెట్‌ ట్రైన్‌!

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:11 AM

బుల్లెట్‌ ట్రైన్‌ త్వరలోనే భారత్‌కు దూసుకురానుంది. అహ్మదాబాద్‌-ముంబై వాణిజ్య కారిడార్‌ మధ్య చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా 2027 ఆగస్టులో తొలిసారిగా ట్రయల్‌...

Bullet Train on Track: దూసుకొస్తున్న బుల్లెట్‌ ట్రైన్‌!

  • 2026 నాటికి అహ్మదాబాద్‌-ముంబై ట్రాక్‌ పనులు పూర్తి

  • 2027లో ట్రయల్‌ రన్‌

(అహ్మదాబాద్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

బుల్లెట్‌ ట్రైన్‌ త్వరలోనే భారత్‌కు దూసుకురానుంది. అహ్మదాబాద్‌-ముంబై వాణిజ్య కారిడార్‌ మధ్య చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా 2027 ఆగస్టులో తొలిసారిగా ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. 2029 ఏడాది చివరినాటికి దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ప్రాజెక్టుకు 2018లోనే రూపకల్పన జరిగింది. రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గంటలకు 320 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ప్రత్యేకంగా గుజరాత్‌లో 8 స్టేషన్లు, మహారాష్ట్రలో 4 స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే సబర్మతి నుంచి ముంబైకి 2 గంటలా 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ రైలు సబర్మతిలో బయల్దేరి అహ్మదాబాద్‌, వడోదర, భరూచ్‌, సూరత్‌, బిల్‌మోర, వాపి, బొయిసార్‌, విరార్‌, థానే మీదుగా ముంబైకి చేరుకుంటుంది. భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ వేగాన్ని గంటకు 350 కి.మీ.కే పరిమితం చేస్తున్నప్పటికీ.. 500 కి.మీ. వేగంతో దూసుకెళ్లినా తట్టుకునేలా ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. 2026 మార్చి నాటికి ట్రాక్‌ పనులు పూర్తవుతాయి. 2027ఆగస్టులో సబర్మతి నుంచి బిల్మోరా వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తారు.


జపాన్‌ సాంకేతికతతో ట్రాక్‌..

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం జపాన్‌ సాంకేతికతతో వయాడక్ట్‌ ట్రాక్‌ వేస్తున్నారు. దీనికోసం నదులపై ప్రత్యేకంగా బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. మొత్తం 508 కిలోమీటర్ల దూరానికి 8 కిలోమీటర్లు మాత్రమే నేలపై ట్రాక్‌ వేస్తున్నారు. కొండలను తవ్వి 8 టన్నెళ్లను ఏర్పాటు చేశారు. మిగిలిన దూరమంతా మెట్రో రైలు తరహాలో పిల్లర్లమీదే ట్రాక్‌ వేస్తారు. మెట్రో రైళ్ల కోసం యాజమాన్య నిర్వహణ సంస్థలు పత్యేకంగా ట్రాక్‌లు, స్టేషన్లను నిర్మిస్తున్నాయి. కానీ ఇవి ఇతర రైల్వే స్టేషన్లకు అనుసంధానంగా ఉండటం లేదు. కానీ, బుల్లెట్‌ ట్రైన్‌ కోసం మెట్రో, సాధారణ రైల్వే స్టేషన్లను కలిపేలా ప్రత్యేక స్టేషన్లను నిర్మిస్తున్నారు. అహ్మదాబాద్‌-ముంబై హైస్పీడ్‌ రైల్‌ ప్రాజెక్టు కోసం జపాన్‌ సాంకేతిక సహకారం అందిస్తోంది. రూ.1,08,000 కోట్లలో 81 శాతం నిధులను జపాన్‌ ప్రభుత్వ బ్యాంకు జైకా అందిస్తోంది. ఆర్థిక సహకారం, సాంకేతిక నైపుణ్యం మినహా.. స్టేషన్లు, ట్రాక్‌ల నిర్మాణాలకు స్వదేశీ వనరులనే ఉపయోగిస్తున్నారు. ఎల్‌ అండ్‌ టీ దీనికి సహకారం అందిస్తోంది.

బుల్లెట్‌ ట్రైన్‌ స్టేషన్ల ప్రత్యేకతలు...

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న స్టేషన్లను... మెట్రో, రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్నారు. మెట్రో, రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా బుల్లెట్‌ ట్రైన్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాంపులు, వంతెనలు, మూవింగ్‌ వాక్‌ ట్రాక్‌లూ, ఎస్కలేటర్లను నిర్మిస్తున్నారు. ప్రయాణికుల కోసం 700 సీట్లతో కూడిన వెయిటింగ్‌ హాల్‌తో పాటు బిజినెస్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించే ఈ స్టేషన్లలో మార్కెట్‌, సినిమాహాల్‌, కాన్ఫరెన్సు హాల్‌, 5స్టార్‌ హోటల్‌ను నిర్మిస్తున్నారు. సబర్మతి-ముంబై బుల్లెట్‌ ట్రైన్‌ దేశ ఆర్థిక గమనాన్నే మార్చేస్తుందని అహ్మదాబాద్‌ నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌) ప్రిన్సిపల్‌ ప్రాజెక్టు మేనేజర్‌ రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన అమరావతి నుంచి పీఐబీ తరఫున వచ్చిన మీడియా ప్రతినిధులకు వివరాలు వెల్లడించారు.

Updated Date - Dec 09 , 2025 | 03:11 AM